Viral Accident News | మద్యం బాటిళ్ల కంటే మనిషి ప్రాణం చవకైపోయిందా?

Viral Accident News | మద్యం బాటిళ్ల కంటే మనిషి ప్రాణం చవకైపోయిందా?

  • ప్రమాదంలో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని వదిలేసి…
  • సరుకు కోసం పరుగులు తీస్తున్న సమాజం!

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రోడ్డుపై ఒక లారీ బోల్తా పడింది… ఒక్క క్షణం ఆ దృశ్యాన్ని ఊహించుకోండి (Viral Accident News). వాహనం నుజ్జునుజ్జైంది… డ్రైవర్, క్లీనర్ రక్తపు మడుగులో పడి ఉండవచ్చు… ప్రాణం కోసం తల్లడిల్లుతూ “ఎవరైనా కాపాడండి” అని మూలుగుతూ ఉండవచ్చు… కానీ అక్కడ గుమిగూడిన జనంలో చాలా మంది కళ్లకు ప్రాణం కోసం తల్లడిల్లుతూ “ఎవరైనా కాపాడండి” అని మూలుగుతున్న ఆ మనిషి కనిపించలేదు. బోల్తా పడిన వాహనంలోంచి ప్రవాహంలా నేలమీద కుప్పలుగా పడిన లారీలో ఉన్న సరుకు మాత్రమే కనిపించింది…ఆకర్షించింది. అంతే…గుమిగూడిన జనం మధ్య ఎవరి చేతికి ఎన్ని బాటిళ్లు చిక్కాయన్న పోటీ మొదలైంది. ఇది కథ కాదు..వాస్తవం.

చిత్తూరు జిల్లాలో ఇటీవల జరిగిన ఘటన ఇదే చేదు నిజాన్ని మరోసారి మన ముందుంచింది. సుమారు రూ.10 లక్షల విలువైన మద్యం లోడ్‌తో వెళ్తున్న లారీ ప్రమాదానికి గురికాగానే, క్షణాల్లో జనం అక్కడికి చేరుకున్నారు. కానీ బాధితులను రక్షించడానికి కాదు… మద్యం బాటిళ్లు చేజిక్కించుకోవడానికి.

వాహనం బోల్తా పడి అరగంట కూడా గడవలేదు… లారీ ఖాళీ అయిపోయింది. నేలమీద ఒక్క బాటిలూ మిగలలేదు. ఈఘటన గురించి తెలియగానే మన మనసులో మెదిలే ప్రశ్న ఒక్కటే. మన సమాజంలో మానవత్వం అనేది ఇంకా ఎక్కడైనా మిగిలి ఉందా? ఎందుకంటే, ఒకప్పుడు ప్రమాదాలు జరిగిన వెంటనే ఎవరైనా అక్కడికి చేరుకుని ఉంటే, ముందుగా గాయపడిన వారి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేసేవారు..అంబులెన్స్ కు కాల్ చేసేవారు…. మరి ఇప్పుడు..? వీడియోలు తీస్తున్నారు…సెల్ఫీలు తీసుకుంటున్నారు.

ఒకప్పుడు ప్రమాదం జరిగిందంటే అపరిచితులైనా పరుగెత్తుకుంటూ వచ్చి గాయపడిన వారిని ఆసుపత్రికి చేర్చేవారు. ఇప్పుడు అదే ప్రమాదం జరిగితే…ముందుగా జేబుల్లోంచి బయటకు వచ్చేది వారి మొబైల్ ఫోన్. సహాయం చేసే చేతుల కంటే వీడియో తీసే చేతులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

రక్తం కారుతున్న మనిషి కన్నా…రిల్స్, వ్యూస్, వైరల్ పోస్టులకే విలువ పెరిగినట్లుగా అనిపిస్తోంది. కళ్ల ముందు రక్త సిక్తమై..ఒళ్ళంతా గాయాలతో అచేతనంగా…అపస్మారకంగా పడి ఉన్న మనిషి… పరిగెత్తుకొచ్చిన మనుషుల చేతుల్లో సంచులు… ఇటీవలి కాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో ఒకే రకమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రమాదానికి గురైన లారీల నుంచి పండ్లు, కూరగాయలు, నూనె ప్యాకెట్లు, మద్యం బాటిళ్లు… చేతికి ఏది చిక్కితే అది తీసుకెళ్తున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి.

అప్పుడు అక్కడ ఉన్న వ్యక్తులు ఒక విషయం మరిచిపోతున్నారు. ఆ సరుకు వెనుక ఒక మనిషి ఉన్నాడు…ఒక కుటుంబం ఉంది…అతని కోసం ఎదురు చూస్తున్న భార్య ఉంది…”నాన్న ఎప్పుడు వస్తాడు?” అని ఎదురు చూస్తున్న పిల్లలు ఉన్నారు. అతడు ప్రాణాలతో, గాయాలతో బయట పడితే అతడి చొక్క పుచ్చుకుని” నాసరుకేమైంద”ని అతడ్ని నిలదీసే అతడి యజమాని అనేవాడొకడున్నాడు. మనిషి విలువ తగ్గిందా… లేక మనసులు కఠినమయ్యాయా? సామాజిక శాస్త్రవేత్తలు వెలిబుచ్చుతున్న అభిప్రాయం ఒకటే. సాంకేతికత పెరిగింది…సౌకర్యాలు పెరిగాయి…కానీ మనిషికీ మనిషికీ మధ్య పరస్పర బాధ్యత కలిగి ఉండాలనే భావన తగ్గుతోంది. “నాకేంటి?” అనే ఆలోచన…”నేనెందుకు సహాయం చేయాలి?” అనే నిర్లక్ష్యం…

ఇలాంటి సంఘటనల్లో పోలీసులు ఇబ్బంది పెడతారనే భయం కూడా నిజం కాదు. చాలామందిలో ఇప్పటికీ ఒక అపోహ, భయం ఉంది. ప్రమాద బాధితులను ఆసుపత్రికి తీసుకెళ్తే పోలీసులు వేధిస్తారనేది. కానీ వాస్తవానికి ‘గుడ్ సమారిటన్’ చట్టం ప్రకారం ప్రమాద బాధితులకు సహాయం చేసే వారికి పూర్తి చట్టపరమైన రక్షణ ఉంది. సహాయం చేసినందుకు ఎవరూ ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు.

కానీ ఈ విషయం ఇంకా ప్రజల్లో పూర్తిగా చేరలేదు. ఒక్కసారి మీ కుటుంబాన్ని ఊహించుకోండి…రేపు ఇదే పరిస్థితి…రోడ్డుపై ప్రమాదానికి గురైన వ్యక్తి మీ తండ్రి అయితే? మీ కొడుకు అయితే? మీ భర్త అయితే? మీ భార్య అయితే? అప్పుడు అక్కడున్నవారు సహాయం చేయకుండా…వారి వస్తువులు తీసుకెళ్లడంలో బిజీగా ఉంటే…మీ మనసు ఎలా తట్టుకుంటుంది?

ఈ ఒక్క ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పుకుంటే చాలు…మన ప్రవర్తన మారుతుంది. వస్తువులు తిరిగి వస్తాయి… మరి ప్రాణాలు రావు. ప్రమాదం జరిగినప్పుడు చేయాల్సింది చాలా స్పష్టం. 108కు కాల్ చేయాలి. పోలీసులకు సమాచారం ఇవ్వాలి. గాయపడిన వ్యక్తిని రక్షించాలి.అంతే తప్ప… వీడియోలు తీయడం కాదు… సరుకు ఎత్తుకెళ్లడం కాదు… సోషల్ మీడియాలో వైరల్ చేయడం కాదు. ఎందుకంటే… వస్తువులు మళ్లీ సంపాదించుకోవచ్చు. కానీ ఒకసారి పోయిన ప్రాణం తిరిగి రాదు.

AP | అరగంటలో లోడ్​ మాయం..

Leave a Reply