తరగతి గది నుంచి ఢిల్లీ వేదికగా..

తరగతి గది నుంచి ఢిల్లీ వేదికగా..

రాజ్యసభకు భాష్యం రామకృష్ణ

ఉమ్మడి గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ:

ఒకప్పుడు తరగతి గదిలో విద్యార్థులకు లెక్కల పాఠాలు బోధించిన ‘మాష్టారు’, నేడు దేశ అత్యున్నత చట్టసభ ‘రాజ్యసభ’లో అడుగుపెట్టబోతున్నారు. పల్నాడు జిల్లా అమరావతి మండలం ఎనికేపాడు గ్రామానికి చెందిన భాష్యం రామకృష్ణ రాజకీయ ప్రస్థానంపై ప్రస్తుతం విద్యా, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. విద్యనే సామాజిక మార్పుకు ప్రధాన సాధనంగా ఎంచుకున్న ఈ విద్యావేత్త ప్రయాణం, జాతీయ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి తెరలేపింది.

సామాన్యుడి నుంచి విద్యా సామ్రాజ్యం వరకు..

సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన రామకృష్ణ, బీఎస్సీ, బీఎడ్ పూర్తి చేసి విద్యా రంగాన్నే తన జీవిత లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అత్యంత వినమ్రంగా ప్రారంభమైన ‘భాష్యం’ ప్రస్థానం, నేడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో 163 శాఖలకు విస్తరించి దిగ్గజ సంస్థగా ఎదిగింది. సుమారు 1.59 లక్షల మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు అందిస్తున్న ఈ విద్యా సామ్రాజ్యం వెనుక ఆయన అంకితభావం, దూరదృష్టి దాగున్నాయి. క్రమశిక్షణ, నాణ్యమైన విద్య, మెరుగైన ఫలితాలు అనే మూడు సూత్రాలను పాటిస్తూ, తన సంస్థలను రాష్టంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దారు.

అంతర్జాతీయ వేదికపై భాష్యం…

వైద్య, ఇంజినీరింగ్, సివిల్ సర్వీసెస్ సహా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో విద్యార్థులు సాధించిన విజయాలు భాష్యం సంస్థలకు ప్రత్యేక ముద్రను వేశాయి. 2011లో ‘రాష్ట్ర ఉత్తమ పాఠశాల’ అవార్డు నుంచి 2022లో బ్రిటిష్ కౌన్సిల్ గుర్తింపు వరకు ఎన్నో పురస్కారాలు ఆయనను వరించాయి. ముఖ్యంగా 2017లో దక్కిన గిన్నిస్ వరల్డ్ రికార్డు, 2019లో ఆసియాస్ ఎడ్యుకేషన్ అవార్డులు రామకృష్ణ విద్యా సేవలకు నిదర్శనంగా నిలిచాయి.

సేవాగుణంలోనూ రామకృష్ణ ‘భాష్యం’..

విద్యా రంగంలో గడించిన కీర్తిని, లాభాలను సమాజానికి తిరిగి పంచాలనే సంకల్పంతో రామకృష్ణ సేవా పథంలోనూ ముందున్నారు. తన మాతృమూర్తి పేరుతో స్థాపించిన ‘భాష్యం పేరమ్మ ఛారిటబుల్ ట్రస్ట్’ ద్వారా విద్య, వైద్యం, అన్నదాన రంగాల్లో ఆయన వెచ్చించిన నిధులు కోట్లాది రూపాయలు. ప్రతి ఏటా పేద విద్యార్థులకు రూ.2 కోట్లకు పైగా స్కాలర్‌షిప్‌లు అందించడం, వైద్య శిబిరాలు, రక్తదాన కార్యక్రమాలతో ఎందరికో ఆసరాగా నిలిచారు.

ఆపదలోపెద్దన్నగా… అందరికీ అండగా..

కేరళ వరదలు, హుద్‌హుద్ తుపాను, కర్నూలు వరదల సమయాల్లోనూ, ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో సంభవించిన విపత్తుల వేళ రామకృష్ణ అందించిన విరాళాలు ఎంతో మందికి ఊరటనిచ్చాయి. భాష్యం పేరమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ పేరిట రూ.10 కోట్లకు పైగా విరాళాలు అందించిన పెద్ద మనసు రామకృష్ణది. అలాగే కోట్లాది మందికి నిత్యాన్న ప్రసాదం అందించే తిరుమలకు అయన విరాళం రూ.రూ.2 కోట్లు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అన్నదాన ట్రస్ట్‌కు పదేపదే భారీ విరాళాలు అందిస్తూ, తనలోని భక్తిభావానికి, సేవా దృక్పథానికి నిదర్శనంగా నిలిచారు.

రాజకీయ నేపథ్యం.. నమ్మకమే పెట్టుబడిగా..

ప్రత్యక్ష రాజకీయాల్లో హడావుడి చేయకపోయినా, తెలుగుదేశం పార్టీతో రామకృష్ణకు దశాబ్దాల అనుబంధం ఉంది. పార్టీ సిద్ధాంతాలపై నమ్మకం, నాయకత్వంతో సన్నిహిత సంబంధాలు, అభివృద్ధి రాజకీయాల పట్ల ఆయనకున్న నిబద్ధత పార్టీలో ఆయనకు ప్రత్యేక స్థానాన్ని కల్పించాయి. గతంలో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిత్వం రేసులోనూ ఆయన పేరు బలంగా వినిపించింది. ఆ తరువాత సీఎం చంద్రబాబు ఆయన్ను ఎంపిక చేశారు.

రాజ్యసభలో విద్యావేత్త గళం..

ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఎంపిక వెనుక, విద్యా రంగంలో ఆయనకున్న మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవమే ప్రధాన భూమిక పోషించింది. దేశ విద్యా విధానాలు, యువత నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, ప్రైవేట్ విద్యా సంస్థల సవాళ్లపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా, ఆయన రాజ్యసభలో రాష్ట్ర ప్రయోజనాల కోసం గళమెత్తుతారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎనికేపాడు అనే చిన్న గ్రామం నుంచి ఢిల్లీ పెద్దల సభ దాకా చేరిన రామకృష్ణ ప్రస్థానం, నేడు గుంటూరు నేలకే గర్వకారణంగా మారింది.

Leave a Reply