సీఎం పర్యటనకు విస్తృత ఏర్పాట్లు
సీఎం పర్యటనకు విస్తృత ఏర్పాట్లు
- దామినేడు సభా ప్రాంగణాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
- సభా ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో పరిశీలన
- పార్కింగ్, ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి
- వైద్య, భద్రతా సదుపాయాలు సిద్ధం చేయాలని ఆదేశం
తిరుపతి ప్రతినిధి , ఆంధ్రప్రభ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం తిరుపతి జిల్లాలో పర్యటించనున్న సందర్భంగా దామినేడు వద్ద నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పరిశీలించారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి సభా ప్రాంగణాన్ని సందర్శించిన కలెక్టర్, జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. సభా ప్రాంగణంతో పాటు పార్కింగ్ ప్రాంతాలు, వాహనాల రాకపోకలకు సంబంధించిన మార్గాలు, వేదిక నిర్మాణ పనులు, ప్రజల ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను అధికారులు పరిశీలించారు. సభకు వచ్చే ప్రజలు, వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పార్కింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని కలెక్టర్ సూచించారు. వాహనాల రాకపోకలు సజావుగా కొనసాగేలా అవసరమైన చోట్ల మార్గదర్శక బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
మౌలిక సదుపాయాలు కల్పన
సభా ప్రాంగణంలో ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. తాగునీటి సౌకర్యాలు, పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుత్ సరఫరా, వైద్య శిబిరాలు, అత్యవసర సేవలు, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. సభలో పాల్గొనే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని చెప్పారు. ప్రస్తుతం ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సభా ప్రాంగణం, వేచి ఉండే ప్రాంతాలు, పార్కింగ్ ప్రాంతాల్లో విస్తృతంగా త్రాగునీటి సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అవసరమైన చోట్ల మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు కూలర్లు, షామియానాలు మరియు ఇతర శీతలీకరణ సదుపాయాలను అధిక సంఖ్యలో ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలు ఎండ ప్రభావానికి గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసు, రెవెన్యూ ఇతర శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

