Jay Shah | అందరికీ ఆల్ ది బెస్ట్ !!

Jay Shah | అందరికీ ఆల్ ది బెస్ట్ !!

  • లండన్‌లో సందడి చేసిన కెప్టెన్స్ కార్నివల్..
  • మహిళల టీ20 ప్రపంచకప్‌కు జై షా శుభాకాంక్షలు

మహిళల టీ20 ప్రపంచకప్-2026కు ముందు ఇంగ్లండ్ రాజధాని లండన్‌లో నిర్వహించిన కెప్టెన్స్ కార్నివల్ అట్టహాసంగా జరిగింది. టోర్నీలో పాల్గొంటున్న 12 జట్ల కెప్టెన్లు లండన్‌లోని ప్రముఖ వాటర్‌లూ బ్రిడ్జ్ వద్ద సందడి చేస్తూ అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఐసీసీ చైర్మన్ జై షా అన్ని జట్లకు శుభాకాంక్షలు తెలియజేశారు.

కెప్టెన్స్ కార్నివల్ అనంతరం సోషల్ మీడియాలో స్పందించిన ఐసీసీ చైర్మెన్ జై షా.. “మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాల్గొంటున్న 12 జట్లకు నా శుభాకాంక్షలు. ఇంగ్లండ్, వేల్స్‌లోని చారిత్రాత్మక వేదికలు రికార్డు స్థాయి ప్రేక్షకులకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి. మహిళల క్రికెట్ చరిత్రలోనే అత్యంత విస్తృత స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ప్రసారం కానున్న టోర్నీ ఇదే. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను, అత్యుత్తమ మహిళా క్రికెటర్లను ఒకే వేదికపైకి తీసుకురానున్న ఈ ప్రపంచకప్ మరపురాని అనుభూతిని అందిస్తుంది” అని పేర్కొన్నారు.

కెప్టెన్స్ కార్నివల్ అంటే ?

మహిళల టీ20 ప్రపంచకప్‌కు ముందు ఐసీసీ నిర్వహించే ప్రత్యేక ప్రచార కార్యక్రమమే కెప్టెన్స్ కార్నివల్. ఇందులో పాల్గొనే జట్ల కెప్టెన్లు అభిమానులతో నేరుగా మమేకమవుతూ టోర్నీపై ఆసక్తిని పెంచుతారు. స్ట్రీట్ క్రికెట్, సరదా స్కిల్ చాలెంజ్‌లు, మీడియా ఇంటరాక్షన్‌లు, వినోద కార్యక్రమాలు ఇందులో భాగంగా ఉంటాయి.

ఈసారి లండన్‌లోని వాటర్‌లూ బ్రిడ్జ్‌పై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై కెప్టెన్లు బ్యాటింగ్, బౌలింగ్ చాలెంజ్‌లలో పాల్గొన్నారు. స్థానిక కళాకారుల ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ దేశాల సంప్రదాయాలను ప్రతిబింబించే వినోద కార్యక్రమాలు ఈ ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

కెప్టెన్స్ కార్నివల్లో ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ స్కివర్-బ్రంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్ కావడంతో ఆమెకు అభిమానుల నుంచి విశేష ఆదరణ లభించింది.

వాటర్‌లూ బ్రిడ్జ్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో నాట్ స్కివర్-బ్రంట్ ఎంట్రీ ఇవ్వగానే అభిమానులు హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు, ఫొటోలు తీసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపారు. దీంతో ఈ ఈవెంట్‌లో ఆమె ప్రధాన ఆకర్షణగా మారారు.

ఇక‌ జూన్ 12 నుంచి ప్రారంభం కానున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఈసారి 12 జట్లు బరిలోకి దిగుతుండటంతో పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్‌తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో బరిలోకి దిగుతుండగా, 2025లో సాధించిన మహిళల వన్డే ప్రపంచకప్ విజయాన్ని టీ20 ఫార్మాట్‌లోనూ కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Leave a Reply