మోదీ పాలనలో అంతర్జాతీయ శక్తిగా భారత్
మోదీ పాలనలో అంతర్జాతీయ శక్తిగా భారత్
- ఏపీ శరవేగంగా అభివృద్ధి
- ఏపీ ప్రగతికి ప్రధాని మోదీ పెద్దపీట..
- కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ
భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: గత 12 ఏళ్ల సుదీర్ఘ అద్భుత పాలనలో దేశాన్ని సర్వతోముఖాభివృద్ధి పథంలో నడిపించడమే కాకుండా భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా నిలబెట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. మోదీ 12 ఏళ్ల విజయవంతమైన పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా దేశంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఏపీ అభివృద్ధికి కేంద్రం అందించిన సహకారం పై భీమవరంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రపంచంలో ఎక్కడున్నా ప్రతి భారతీయుడు గర్వపడేలా మోదీ పాలన సాగిందని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ స్పష్టం చేశారు. దేశంలోని ప్రతి పేద కుటుంబానికి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నేరుగా చేరాయని వివరించారు. పేదల సంక్షేమమే పరమావధిగా యువత, మహిళలు, రైతుల అభ్యున్నతి కొరకు ఎన్నో చారిత్రాత్మక పథకాలను అమలు చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిదేనని అన్నారు. మోదీ పాలనలో భారతదేశ అంతర్జాతీయ సంబంధాలు మెరుగై, నేడు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా ప్రధానికి లభిస్తున్న ఘన స్వాగతమే దానికి నిదర్శనమన్నారు.
దేశ ప్రగతిని పరిశీలిస్తే 2014 మోదీ పాలనకు ముందు, 2014 తర్వాత అనే రీతిలో దేశ ముఖచిత్రం మారిపోయిందని ఆయన గణాంకాలతో సహా వివరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గత 12 ఏళ్లలో మోదీ ప్రభుత్వం అందించిన భారీ నిధులు, వివిధ సంక్షేమ, మౌలిక వసతుల కల్పన వివరాలను గణాంకాలతో వెల్లడించారు. గత రెండు సంవత్సరాలుగా కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్ల డబుల్ ఇంజిన్ అభివృద్ధి రాష్ట్రంలో శరవేగంగా జరుగుతుందన్నారు. ఏపీ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ పూర్తి సహాయ సహకారాలు అందించడం వల్ల రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి పరుగు పెడుతోందని శ్రీనివాస వర్మ పేర్కొన్నారు.
గత 12 ఏళ్లలో దేశవ్యాప్తంగా 58 కోట్ల మందికి పీఎం జన్ ధన్ యోజన ఖాతాలు తెరిచి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనే రికార్డు స్థాయిలో 1.69 కోట్లకు పైగా జన్ ధన్ ఖాతాలను విజయవంతంగా తెరిచారు అని అన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 57 కోట్లకు పైగా ముద్రా రుణాలు మంజూరు చేసి, 12 కోట్లకు పైగా నూతన చిన్నతరహా వ్యాపారవేత్తలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించిందని,రూ. 20 లక్షల వరకు పూచీకత్తు లేని ఈ రుణాల ద్వారా దేశవ్యాప్తంగా రూ.40.07 లక్షల కోట్ల రూపాయలు పంపిణీ చేయగా, ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 60.82 లక్షలకు పైగా రుణాల ద్వారా రూ.1.36 లక్షల కోట్ల కంటే ఎక్కువ నిధులను లబ్ధిదారులకు అందించాలన్నారు. గత 12 ఏళ్లలో దేశవ్యాప్తంగా గ్రామీణ పేదల కోసం 4 కోట్లకు పైగా ఇళ్లు నిర్మించగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాలలో 2,47,114 ఇళ్లు , అర్బన్ పరిధిలో లబ్ధిదారుల ఇళ్ల సంఖ్య 21,32,343 కి చేరింది అని ఆయన అన్నారు.
దేశవ్యాప్తంగా దాదాపు 16 కోట్ల గ్రామీణ కుటుంబాలకు కుళాయిల ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందించడం జరిగిందన్నారు. రైల్వే రంగలో అద్భుత ప్రగతి సాధించడం జరిగిందని, గత 12 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో వస్తు, ప్రజా రవాణా మౌలిక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ.73,743 కోట్లను వెచ్చించింది అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.73,743 కోట్ల అంచనా వ్యయంతో 41 కీలక రైల్వే ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయన్నారు.
ఇందులో అమరావతిని అనుసంధానించే నూతన రైల్వే లైన్ (రూ.2,245 కోట్లు), 73 అమృత్ స్టేషన్ల పునర్నిర్మాణ పనులు (రూ3,418 కోట్లు) తో జరుగుతున్నాయన్నారు. 2026-27 రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు రికార్డు స్థాయిలో రూ.10,134 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. ఇది ఉమ్మడి ఏపీ సగటు కేటాయింపు (రూ.886 కోట్లు) కంటే 11 రెట్లు ఎక్కువ అని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో రవాణా వేగాన్ని పెంచుతూ ప్రస్తుతం 8 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయని అన్నారు.
2014 వరకు ఏపీలో కేవలం 4,190 కి.మీ గా ఉన్న జాతీయ రహదారులు, నేడు మోదీ ప్రభుత్వ హయాంలో 8,683 కి.మీ కి పెరిగాయని, హైదరాబాద్-విశాఖపట్నం, బెంగళూరు-చెన్నై, రాయ్‌పూర్-విశాఖపట్నం, చిత్తూరు-తచ్చూరు, బెంగళూరు-కడప-విజయవాడ అనే 5 భారీ గ్రీన్-ఫీల్డ్ కారిడార్ల ద్వారా రోడ్డు నెట్వర్క్ రూపాంతరం చెందింది. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.92,649 కోట్ల విలువైన రహదారి పనులు జరుగుతున్నాయి.
2014లో దేశంలో కేవలం 842 వైద్య కళాశాలలు ఉండగా, గత 12 ఏళ్లలో అవి 2,100+ కి విస్తరించాయి అన్నారు. ఎయిమ్స్ ల సంఖ్య 8 నుండి 23కి పెరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ పరిధిలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఒక మంగళగిరి ఎయిమ్స్ , 7 ఈఎస్ఐ ఆసుపత్రులు మరియు రికార్డు స్థాయిలో 17 కొత్త మెడికల్ కాలేజీలను మంజూరు చేసి ఏపీ ఆరోగ్య రంగాన్ని అగ్రభాగాన నిలిపింది అన్నారు. గత రెండేళ్లలో ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలో ఐదు సార్లు పర్యటించడం ఆయన ఆంధ్ర అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారటానికి నిదర్శనం అని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రగతికి తలమానికమైన మెగా ప్రాజెక్టులకు మోదీ ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసి సహకరిస్తుందని అన్నారు. రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ.23,988.68 కోట్లు విడుదల చేసి పనులను శరవేగంగా ముందుకు నడిపిస్తోంది అన్నారు.
