Tipper Accident | కాంగ్రెస్ నేత మృతి

Tipper Accident | కాంగ్రెస్ నేత మృతి

Tipper Accident | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్లపల్లి గ్రామంలో అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్న టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో చింతకాని గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు మాతంగి నాగరాజు (33) మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన స్నేహితుడిని పరామర్శించి, తిరిగి బైక్‌పై ఇంటికి వస్తుండగా నాగరాజును టిప్పర్ లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందగా, ఆయనతో పాటు ఉన్న మహేందర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన మహేందర్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మృతుడు నాగరాజుకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న నాగరాజు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ తోట వెంకటేశ్వర్లును చింతకాని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లకు చెందిన అతడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి ఖమ్మం జిల్లాకు భారీ ఎత్తున అక్రమంగా ఇసుక రవాణా జరుగుతోందన్న ఆరోపణలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఏపీలో ఉచితంగా లభిస్తున్న ఇసుకను తెలంగాణకు తరలించి, ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో విక్రయిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply