Sircilla | పట్టుదల ఉంటే ఉన్నత శిఖరాలను చేరుకుంటారు

Sircilla | పట్టుదల ఉంటే ఉన్నత శిఖరాలను చేరుకుంటారు

  • సిబ్బంది పిల్లలకు ఎస్పీ ప్రశంసలు

సిరిసిల్ల, ఆంధ్రప్రభ: ఇటీవల విడుదలైన పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పిల్లలను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ప్రత్యేకంగా అభినందించారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులను సన్మానించి వారి విజయాలను ప్రశంసించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు కృషి, పట్టుదల, క్రమశిక్షణతో చదివి మంచి ఫలితాలు సాధించారని కొనియాడారు. భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని విజయపథంలో ముందుకు సాగాలని సూచించారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివానని, తన తల్లిదండ్రులు ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్నారని గుర్తు చేశారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా నిరాశ చెందకుండా లక్ష్యసాధన కోసం కష్టపడి పనిచేస్తే జీవితంలో ఉన్నత స్థానాలను చేరుకోవచ్చని విద్యార్థులకు ప్రేరణనిచ్చారు.

పట్టుదల, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం విజయానికి కీలకమని పేర్కొన్న ఎస్పీ.. పోలీసు శాఖలో ప్రజల సేవ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి వారికి గౌరవం ఇవ్వాలని విద్యార్థులకు సూచించారు. ప్రతి రోజూ కొత్త విషయాలు నేర్చుకునే అలవాటు పెంచుకోవాలని, జీవితాంతం విద్యార్థులుగానే ఉండాలని సూచించారు.

కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎస్పీ మెమెంటోలు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, పోలీసు అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a Reply