మన యువత భవిష్యత్తు కోసం రష్యాలో ఏపీ అడుగులు..!
మన యువత భవిష్యత్తు కోసం రష్యాలో ఏపీ అడుగులు..!
పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా నారా లోకేష్ బృందం చర్చలు
పల్నాడు ప్రతినిధి, ఆంధ్రప్రభ: రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి, యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి బృందం రష్యాలో కీలక సమావేశాలు నిర్వహిస్తోంది. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నేతృత్వంలోని బృందం సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరుగుతున్న రష్యా-భారత్ వ్యాపార వేదిక2026లో పాల్గొంటోంది.

రాబోయే రోజుల్లో సెమీకండక్టర్లు, స్మార్ట్ సిటీలు, రైల్వే తయారీ, అణుశక్తి, అడ్వాన్స్‌డ్ లాజిస్టిక్స్ వంటి వ్యూహాత్మక రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ను ప్రధాన పెట్టుబడి కేంద్రంగా తీర్చిదిద్దడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని సమాచారం.

ఈ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాత అల్యూమినియం ఉత్పత్తి సంస్థ RUSAL ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ రంగాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, విశాఖపట్నం–చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో ఆటోమోటివ్ & ఏరోస్పేస్ అల్లాయ్ ప్లాంట్ ఏర్పాటుపై ప్రతిపాదనలు చేసినట్లు తెలిసింది.
ఈ పెట్టుబడులు కార్యరూపం దాల్చితే రాష్ట్రంలో భారీ స్థాయిలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలు, విదేశాలకు వలస వెళ్లాల్సిన అవసరం తగ్గి, స్వరాష్ట్రంలోనే అంతర్జాతీయ ప్రమాణాల అవకాశాలు అందుబాటులోకి రావచ్చని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రాన్ని పారిశ్రామికంగా మరింత బలోపేతం చేసి, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రతినిధి బృందం చేపడుతున్న ప్రయత్నాలు ఫలించాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.
