HYDRA | చారిత్రక భూమికి హైడ్రా కవచం.. రూ.30 వేల కోట్ల ప్రభుత్వ స్థలానికి ఫెన్సింగ్
HYDRA | చారిత్రక భూమికి హైడ్రా కవచం.. రూ.30 వేల కోట్ల ప్రభుత్వ స్థలానికి ఫెన్సింగ్
HYDRA | హైదరాబాద్, ఆంధ్రప్రభ: అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ దిశగా హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. ప్రకృతికి కవచంగా నిలుస్తున్న 250 కోట్ల సంవత్సరాల చారిత్రక వారసత్వాన్ని రక్షించేలా కీలక చర్యలు తీసుకుంది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడ–ఖాజాగూడ సరిహద్దుల్లో ఉన్న సుమారు 200 ఎకరాల ప్రభుత్వ భూమికి హైడ్రా శుక్రవారం ఫెన్సింగ్ వేసింది. ఈ భూమి విలువ దాదాపు రూ.30 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా.
ఈ ప్రాంతంలో చారిత్రక రాళ్ల గుట్టలు, అతి పురాతన రాతి గుహలు, వాటి మధ్య సహజంగా పెరిగిన చెట్లు, చేమలు ఉన్నాయి. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ భూమిని హెచ్ఎండీఏకు కేటాయించింది. చారిత్రక రాళ్ల గుట్టలను కాపాడాలని కోరుతూ ‘సొసైటీ టూ సేవ్ రాక్స్’ ప్రతినిధులు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో హైకోర్టును కూడా ఆశ్రయించారు.
2019లో రాతి గుట్టలతో పాటు ప్రభుత్వ భూమిని కాపాడాలని మున్సిపల్, రెవెన్యూ శాఖలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, హద్దులు గుర్తించి ఫెన్సింగ్ వేయడంలో జాప్యం జరగడంతో కబ్జాలకు అవకాశం ఏర్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఇదే విషయంపై సొసైటీ టూ సేవ్ రాక్స్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గతంలోనే క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులతో కలిసి హైడ్రా అధికారులు భూమిని పరిశీలించి, ప్రభుత్వ భూమిగా నిర్ధారించారు. దీంతో శుక్రవారం ఫెన్సింగ్ కార్యక్రమాన్ని చేపట్టి, భూమిని కబ్జా కాకుండా రక్షించారు.
రెవెన్యూ రికార్డుల ప్రకారం..
రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 452/1లో 174 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అలాగే సర్వే నంబర్ 454/1లో 119.05 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. మొత్తం 293.05 ఎకరాల్లో 263.05 ఎకరాలను గతంలో రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండీఏకు కేటాయించింది.
అయితే, రెండు గ్రామాల మధ్య ఓవర్‌ల్యాప్ సమస్యల కారణంగా 63.05 ఎకరాలు ప్రైవేటు వ్యక్తులకు చెందినవిగా రెవెన్యూ అధికారులు గుర్తించారు. దీంతో హెచ్ఎండీఏకు సుమారు 200 ఎకరాల భూమి మాత్రమే మిగిలింది. ఈ చారిత్రక గుట్టల ప్రాంతంలో వివిధ దేవాలయాలకు 5 ఎకరాలు, దర్గాకు 5 ఎకరాలు కేటాయించినట్టు రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. మిగిలిన హెచ్ఎండీఏ భూమిని హైడ్రా ఫెన్సింగ్ వేసి రక్షించింది.
చారిత్రక బండరాళ్లకు రక్షణ
సొసైటీ టూ సేవ్ రాక్స్ ప్రతినిధులు కోరినట్టుగా ఈ ప్రాంతంలోని చారిత్రక బండరాళ్లను కూడా హైడ్రా కాపాడినట్టయింది. మంచి వ్యూ పాయింట్‌తో, సహజ సిద్ధంగా ఎంతో ఎత్తుగా ఉన్న ఈ గుట్టలు 250 కోట్ల సంవత్సరాల చరిత్రను కలిగి ఉన్నాయని రాక్ సొసైటీ ప్రతినిధులు తెలిపారు. ప్రకృతి వారసత్వాన్ని కాపాడినందుకు హైడ్రాను వారు అభినందించారు.
రాళ్ల గుట్టలతో పాటు పలు ఆలయాలు ఉన్న ఈ చారిత్రక ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకున్న హైడ్రాకు ప్రజలు, భక్తులు, పర్యావరణ ప్రేమికులు కృతజ్ఞతలు తెలిపారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చూపిన చొరవను ప్రశంసించారు.
ఈ గుట్టలకు ఆనుకుని ఉన్న భగీరథమ్మ చెరువును కూడా పునరుద్ధరిస్తున్నారు. ఒకవైపు ఎత్తైన కొండలు, మరోవైపు దిగువ భాగంలో భగీరథమ్మ చెరువు అభివృద్ధి చెందితే, ఈ ప్రాంతం ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడ్డారు.
