Rajat Patidhar | బ్లూ జెర్సీలో ‘రపా’..

Rajat Patidhar | బ్లూ జెర్సీలో ‘రపా’..

  • రజ‌త్ పాటిద‌ర్ కు టీమిండియా తలుపు

ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఛాంపియన్‌గా నిలిపిన కెప్టెన్ రాజత్ పాటిదార్‌కు టీమిండియా నుంచి పిలుపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆఫ్ఘానిస్థాన్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు ముందు భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో సిరీస్ మొత్తానికి దూరమ‌య్యాడు. ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా విరాట్‌కు గాయం అయినట్లు తెలుస్తోంది. స్కానింగ్‌లో హ్యామ్‌స్ట్రింగ్ టెండన్‌లో చీలిక ఉన్నట్లు వైద్యులు గుర్తించినట్టు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

విరాట్ స్థానంలో ప్రస్తుతం ఇండియా-ఏ జట్టుతో శ్రీలంక పర్యటనలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు అవకాశం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ రుతురాజ్‌ను ప్రధాన జట్టులోకి తీసుకుంటే, ఇండియా-ఏ జట్టులో ఖాళీ అయ్యే స్థానానికి రాజత్ పాటిదార్‌ను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఇక రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పైనా సందేహాలు నెలకొన్నాయి. ఐపీఎల్‌లో హ్యామ్‌స్ట్రింగ్ సమస్యతో ఇబ్బంది పడిన రోహిత్‌ను జట్టులో ఎంపిక చేసినప్పటికీ, ఆయన పూర్తి సిరీస్‌కు అందుబాటులో ఉంటారా లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

అదే సమయంలో యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించే దిశగా సెలెక్టర్లు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే వంటి యువ క్రికెటర్లకు సెలక్షన్ కమిటీ నుంచి సంకేతాలు అందినట్లు సమాచారం. జూన్ 13 నుంచి ధర్మశాలలో ప్రారంభమయ్యే ఈ సిరీస్‌లో భారత్-ఆఫ్ఘానిస్థాన్ జట్లు తలపడనున్నాయి. రెండో వన్డే జూన్ 17న లక్నోలో, మూడో వన్డే జూన్ 20న చెన్నైలో జరగనుంది.

Leave a Reply