వీరాపురంలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం
వీరాపురంలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం
మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్
శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం వీరాపురం గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అటవీ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాల విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాల్సిన అవసరాన్ని వివరించారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లో చెట్లు నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు.
వీరాపురం గ్రామానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన సైబీరియన్ వలస పక్షులు (పెయింటెడ్ స్టార్క్స్)ను వీక్షించేందుకు ఏర్పాటు చేసిన వాచ్ టవర్ను కలెక్టర్ సందర్శించారు. అక్కడ విద్యార్థులకు బైనాక్యులర్లను అందించి పక్షులను ఎలా పరిశీలించాలో స్వయంగా వివరించారు. ఈ పక్షుల జీవన విధానం, వలసల కారణాలు, పర్యావరణ సమతుల్యతలో వాటి పాత్ర గురించి తెలుసుకోవాలని విద్యార్థులకు సూచించారు. పర్యాటకుల కోసం కూడా బైనాక్యులర్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అటవీ శాఖ ఏర్పాటు చేసిన సీడ్ బాల్స్ స్టాల్ను పరిశీలించిన కలెక్టర్, విద్యార్థులకు సీడ్ బాల్స్ తయారీ విధానాన్ని వివరించి పంపిణీ చేశారు. చెట్లు లేని ఖాళీ ప్రదేశాల్లో వీటిని విస్తృతంగా చల్లడం ద్వారా హరిత కవచాన్ని పెంచవచ్చని చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో సీడ్ బాల్స్ కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
అనంతరం గ్రామంలోని మహిళా సంఘాల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీ షాపును కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్వయం సహాయక సంఘాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, పెనుకొండ అటవీ క్షేత్ర అధికారి ఈ.జే. శ్రీనివాసులు రెడ్డి, అటవీ శాఖ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడంతో పాటు ప్రకృతి సంరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనే సందేశాన్ని అందించింది.
