ఆదాయ లక్ష్యాలపై కమిషనర్ ఫోకస్…

ఆదాయ లక్ష్యాలపై కమిషనర్ ఫోకస్…

ఎక్కడ వేగం పెంచాలని ఆదేశం?

శ్రీకాకుళం కార్పొరేషన్‌, ఆంధ్రప్రభ : నగరపాలక సంస్థ పరిధిలో లేఅవుట్ క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్‌), ఖాళీ స్థలాల పన్ను (వీఎల్‌టీ) ప్రక్రియలను మరింత వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ హనుమంతు కూర్మారావు అధికారులను ఆదేశించారు.

గురువారం ఉదయం నగరంలోని పలు ప్రాంతాల్లో ఆయన క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థకు రావాల్సిన ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. నిబంధనల మేరకు పన్నుల లెక్కింపు, వసూళ్ల ప్రక్రియ పారదర్శకంగా సాగాలని స్పష్టం చేశారు.

పర్యటనలో భాగంగా కమిషనర్ తొలుత ఏవీఎం టవర్స్‌ను సందర్శించారు. అనంతరం తోటపాలెం కల్కినగర్, ఏవీఎన్ ఎవెన్యూస్ ప్రాంతాల్లోని ఎల్‌ఆర్‌ఎస్‌ స్థలాలను పరిశీలించి, లేఅవుట్ల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అలాగే పి.ఎన్. కాలనీ, శాంతినగర్ కాలనీ, దండి వీధి, సాయినగర్, పట్నాయక్ కాలనీల్లోని వీఎల్‌టీ పరిధిలో ఉన్న స్థలాలను స్వయంగా తనిఖీ చేశారు. క్షేత్రస్థాయి నివేదికలను పరిశీలించి, నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు.

ఎల్‌ఆర్‌ఎస్‌, వీఎల్‌టీ ప్రక్రియల ద్వారా నగరపాలక సంస్థ ఆదాయాన్ని పెంచడంతో పాటు పెండింగ్ అంశాల పరిష్కారానికి చర్యలు వేగవంతం చేయాలని కమిషనర్ ఆదేశించారు.

ఈ పర్యటనలో మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply