చౌటుప్పల్‌ను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం: చైర్‌పర్సన్ పావని

చౌటుప్పల్‌ను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం: చైర్‌పర్సన్ పావని

చౌటుప్పల్, ఆంధ్రప్రభ: చౌటుప్పల్ పురపాలక సంఘం పరిధిలో “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”లో భాగంగా 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక వార్డు సభలు గురువారం నిర్వహించారు. పట్టణంలోని 1, 2, 3, 12, 13వ వార్డుల్లో స్థానిక కౌన్సిలర్ల అధ్యక్షతన ప్రజలతో ముఖాముఖి సమావేశాలు జరిగాయి.

ఈ సభలకు మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, మండల తహసీల్దార్ వీరాబాయి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సాగిన ఈ సభల్లో చైర్‌పర్సన్ స్వయంగా ఐదు వార్డుల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల తక్షణ పరిష్కారానికి అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక సహకారంతో చౌటుప్పల్ పట్టణాన్ని ఆదర్శవంతమైన ప్రగతి పథంలో నడిపిస్తామని తెలిపారు. ప్రతి వార్డులో ఉన్న ప్రజా సమస్యలను వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో పరిష్కరిస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు.

హెల్త్, పోలీస్, మున్సిపల్, అగ్రికల్చర్, ఎలక్ట్రికల్, రెవెన్యూ శాఖల అధికారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ప్రజలకు అవగాహన కల్పించారు. హెల్త్ డిపార్ట్‌మెంట్ డాక్టర్ కాటమరాజు మాట్లాడుతూ.. వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలను వివరించారు.

పోలీస్ డిపార్ట్‌మెంట్ తరఫున సీఐ జి. మన్మధ కుమార్ మాట్లాడుతూ.. పెరుగుతున్న సైబర్ నేరాలు, చిన్న పిల్లలు మత్తు పదార్థాలకు బానిసలవడం వల్ల కలిగే నష్టాలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాల గురించి ప్రజలకు వివరించారు.

మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర నాయక్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలు, మున్సిపల్ పరిధిలో తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం, ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అగ్రికల్చర్ ఏఈ, ఎలక్ట్రికల్ లైన్‌మెన్ తదితర అధికారులు స్థానిక సమస్యలపై స్పందించి సూచనలు చేశారు.

1వ వార్డు రైతు వేదిక ప్రాంగణంలో కౌన్సిలర్ కోసనం రాకేష్ రెడ్డి అధ్యక్షతన సభ జరిగింది. 2వ వార్డు తాళ్లసింగారం వార్డు కార్యాలయంలో కౌన్సిలర్ పోలేపల్లి లక్ష్మి ముత్తయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. 3వ వార్డు లింగోజిగూడెం వార్డు కార్యాలయంలో కౌన్సిలర్ పల్లె లావణ్య సురేందర్ రెడ్డి అధ్యక్షతన ప్రజా సమస్యలపై చర్చించారు.

13వ వార్డు భాస్కర్ టాకీస్ ఆవరణలో కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ అధ్యక్షతన సభ జరిగింది. 12వ వార్డు గణేష్ మండపం, సురివి రమేష్ ఇంటి వద్ద కౌన్సిలర్ పాక చిరంజీవి అధ్యక్షతన, కోఆప్షన్ సభ్యులు షేక్ నబీబి జానీ బాబు ఆధ్వర్యంలో స్థానిక సమస్యలపై చర్చించి పరిష్కార మార్గాలను పరిశీలించారు.

ప్రజాప్రతినిధులు, అధికారులు ఒకే వేదికపైకి వచ్చి తమ సమస్యలను నేరుగా వినడం పట్ల ఆయా వార్డుల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, వార్డు సభల నోడల్ అధికారులు, స్థానిక ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply