పాలమూరు జిల్లా దశ దిశను మార్చనున్న సిఎం పర్యటన
పాలమూరు జిల్లా దశ దిశను మార్చనున్న సిఎం పర్యటన
- ముంపు గ్రామాలకు రూ.15 వందల కోట్ల నష్టపరిహారం
- రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి
మక్తల్, ఆంధ్రప్రభ : అత్యంత ప్రతిష్టాత్మకంగా రేపు జరగనున్న సీఎం పర్యటన ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల దశ దిశ ను మార్చివేస్తుందని రాష్ట్ర క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు. మక్తల్ పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ స్కూల్ గ్రౌండ్లో సీఎం పర్యటనపై మంత్రి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ….
రేపు మధ్యాన్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెలికాప్టర్లో మక్తల్ లో బీసీ వెల్ఫేర్ స్కూల్ మైదాన ప్రాంగణానికి చేరుకున్న అనంతరం మక్తల్ -నారాయణపేట -కొడంగల్ ప్రాజెక్టు పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.
కృష్ణా, భీమా నదులపై బ్రిడ్జి కం బారేజ్ లను నిర్మించాలని గత కొన్ని రోజుల నుండి కర్ణాటక రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి బోసు రాజుతో పలు దఫాలుగా చర్చించడం జరిగిందని మంత్రి వెల్లడించారు.ఇరు రాస్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లో ఉంది కాబట్టి కొత్తగా కట్టబోయే ప్రాజెక్ట్ లకు ప్రయోజనకరంగా ఉంటుందని స్పష్టం చేశారు. అటు కర్ణాటక రాష్ట్రంలో అడుగడుగునా బ్రిడ్జి కం బారేజ్ లు ఉన్నాయని, ఇక్కడ మన రాష్ట్రం లో కూడా సాగు,తాగు నీటి అవసరాల కోసం బారేజ్ లు కట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో బ్యారేజీలు కట్టుకోవడం ద్వారా వర్షాకాలంలో వృధాగా పోతున్న వందల టీఎంసీల నీటిని కాపాడుకోవచ్చని మంత్రి తెలిపారు.గత పాలకులు బ్యారేజీల నిర్మాణాన్ని పట్టించుకోలేదన్నారు.
ఇప్పుడు ఇక్కడి ప్రాంత రైతాంగాన్ని, ప్రజలను దృష్టిలో ఉంచుకొని సాగు, తాగు నీటికి శాశ్వతం పరిష్కారం దిశగా రేపు ముఖ్యమంత్రి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ప్రాజెక్ట్ లపై ఏరియల్ సర్వే నిర్వహించనున్నట్లు మంత్రి శ్రీహరి వెల్లడించారు.మక్తల్ ప్రాంతం లో కృష్ణా, భీమా నదులపై నిర్మించతలపెట్టిన ప్రతిపాదిత బ్రిడ్జి కం బారేజ్ లకు ఇరు రాష్ట్రల ముఖ్యమంత్రులు ఒప్పుకున్నారని ఆయన తెలియజేశారు.అదేవిధంగా తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ గూడెబల్లూర్ నుండి తంగిడి మీదుగా హైవే లను కలుపుతూ భీమా నదిపై వంతెనను నిర్మిస్తే ఇరు రాష్ట్రాలకు కనెక్టివిటీ పెరిగి ప్రజలకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు.
ఈ వంతెన నిర్మాణం పై రేపు సీఎంకు ఏరియల్ సర్వే ద్వారా వివరించనున్నట్లు మంత్రి తెలియజేశారు. పెండింగ్ లో ఉన్న భూత్పూర్ నేరేడుగామ్ ముంపు గ్రామాల ప్రజలకు సరైన పరిహారం ప్రకటించేందుకు అవసరమైన అన్ని చర్యలను చేపట్టాలని కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి వివరించారు.అగమ్యగోచరo గా ఉన్న ముంపు గ్రామాల ప్రజల కష్టాలను రేపు ముఖ్యమంత్రి కి వివరించనున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ముంపు గ్రామాల ప్రజలకు 1500 కోట్ల రూపాయలు నష్ట పరిహారం ఇచ్చేందుకు అంగీకరించిన సీఎం రేవంత్ రెడ్డి ,డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి లకు రైతుల తరఫున మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
మక్తల్ -నారాయణపేట -కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా 99 శాతం రైతులను ఒప్పించి భూ నిర్వాసితులకు ఎకరానికి 20 లక్షల రూపాయలు ఇచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదన్నారు.
భూత్పూర్ రిజర్వాయర్లో 15 టీఎంసీ ల నీటిని నిలుపుకోవడానికి అవకాశం కల్పించేలా రేపు జరగబోయే ఏరియల్ సర్వే ద్వారా సీఎంకు వివరిస్తానని మంత్రి తెలిపారు. భూత్పూర్ రిజర్వాయర్లో 15 టీఎంసీల నీటిని నిలుపుకోగలిగితే ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉంటుందని మంత్రి వెల్లడించారు. రేపు జరగబోయే సీఎం పర్యటనను విజయవంతం చేయాలని రైతులకు ప్రజలకు మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి విజ్ఞప్తి చేశారు.
