TTD Health Safety | తిరుమలలో ఆహార భద్రత, పరిశుభ్రతపై ప్రత్యేక శిక్షణ

TTD Health Safety | తిరుమలలో ఆహార భద్రత, పరిశుభ్రతపై ప్రత్యేక శిక్షణ

TTD Health Safety | నాణ్యమైన ఆహారం అందించడమే టీటీడీ లక్ష్యం
స్ట్రీట్ వెండర్లకు అవగాహన, పరిశుభ్రత కిట్ల పంపిణీ
ఆహార భద్రతా ప్రమాణాలపై శిక్షణ కార్యక్రమం
తిరుమల పరిశుభ్రతను మరింత మెరుగుపర్చే చర్యలు

TTD Health Safety | తిరుమల, ఆంధ్రప్రభ ప్రతినిధి: భక్తుల ఆరోగ్యం, ఆహార భద్రతకు టీటీడీ అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని ఎస్వీ మ్యూజియం ఆడిటోరియంలో మంగళవారం టీటీడీ ఆరోగ్యశాఖ, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ, నెస్లే ఇండియా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఆహార భద్రత, పరిశుభ్రతపై మూడురోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తిరుమలకు రోజూ లక్షలాది మంది భక్తులు విచ్చేస్తున్న నేపథ్యంలో వారికి నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించడం టీటీడీ బాధ్యత అన్నారు. ఆహార తయారీ, నిల్వ, పంపిణీ ప్రక్రియల్లో పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

ఇప్పటికే తిరుమలలో ఆహార భద్రత, పరిశుభ్రతపై పలు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించినప్పటికీ వాటిని నిరంతరం కొనసాగించేందుకు ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు ఎంతో అవసరమని చెప్పారు. టీటీడీ అన్నప్రసాదంలో నాణ్యమైన ఆహార ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తోందన్నారు. అదే రీతిలో తిరుమలలోని వివిధ హోటళ్లు కూడా ఉన్నత ఆహార ప్రమాణాలను పాటించాలని ఆదేశించారు.

టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి

తిరుమలలో ప్రస్తుతం సుమారు 325 దుకాణాల్లో స్ట్రీట్ వెండర్లు ఆహార విక్రయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, వాటిలో దాదాపు 1,300 మంది సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. సంస్థల యజమానులు తమ సిబ్బందికి పరిశుభ్రత, ఆహార భద్రత ప్రమాణాలపై నిరంతరం అవగాహన కల్పించాలని సూచించారు.

నెస్లే ఇండియా సంస్థ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న వారికి గ్లోవ్స్, ఆప్రాన్‌లు, సబ్బులు, టోపీలు తదితర వస్తువులు ఉండే కిట్లను ఉచితంగా అందజేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా ఆహార విక్రయ కేంద్రాల్లో మరింత పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు అందరూ కృషి చేయాలని అన్నారు.

ఈ శిక్షణలో ఆహార భద్రతా ప్రమాణాలు, చట్టబద్ధమైన నిబంధనలు, వ్యక్తిగత పరిశుభ్రత, ఆహార నిర్వహణ విధానాలపై అవగాహన కల్పించి, ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తిరుమలలో పరిశుభ్రతను మరింత మెరుగుపరచడం కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈవో సోమన్నారాయణ, హెల్త్ ఆఫీసర్ డా. సుధారాణి, క్వాలిటీ మేనేజర్ లక్ష్మీనారాయణరెడ్డి, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రతినిధులు, నెస్లే ఇండియా మేనేజర్ వసీమ్ అహ్మద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply