జేఈఈలో మెరిసిన గిరిజన ఆణిముత్యం..

బోనకల్, ఆంధ్రప్రభ : కలలు కనడం గొప్ప విషయం అయితే, ఆ కలలను నిజం చేసుకోవడానికి మరింత శ్రమించాలి. అటువంటి పట్టుదలతో కృషి, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచాడు ఖమ్మం జిల్లా, బోనకల్ మండలం, బోనకల్ గ్రామానికి చెందిన ఆణిముత్యం బానోత్ కార్తీక్. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన కార్తిక్ దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో ఆల్ ఇండియా ఎస్టీ ర్యాంక్ 225 సాధించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. అతి సామాన్య కుటుంబ నేపథ్యం అయినప్పటికీ చదువుల బాటలో మట్టిలో మాణిక్యంలా మెరిశాడు. ఈ పోటీ ప్రపంచంలో జేఈఈ పరీక్షల్లో రాణించడం అంత సులభం కాదు. కష్టాలను అవకాశాలుగా మలుచుకుంటూ కార్తీక్ ముందుకు సాగాడు.

ఏదయినా ప్రతిష్ఠాత్మక ఐఐటీలో ప్రవేశానికి అర్హత పొందనున్నాడు. పట్టుదలతో చదివి ర్యాంక్ సాధించి గ్రామీణ ప్రాంత యువతకు ఆదర్శంగా నిలిచిన కార్తీక్ ను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బోనకల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్, ఉప సర్పంచ్ బానోత్ జ్యోతి కొండ, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గుండపనేని సుధాకర్ రావు, పాసంగులపాటి కోటేశ్వరరావు పోటు వెంకటేశ్వర్లు, చిన్న నరసింహ, యార్లగడ్డ రమేష్, మరీదు శేషు, గంగుల పుల్లయ్య ఎస్కే మీరా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply