ఎన్టీఆర్ భరోసాతో అవ్వాతాతల ముఖాల్లో చిరునవ్వులు
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ: ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం పేద ప్రజలకు వరంలా మారిందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందించి వారి కళ్లల్లో ఆనందం చూడటమే ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు.
పట్టణంలోని 21వ వార్డు ఇందిరానగర్ పరిధిలో సోమవారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఫరూక్ పాల్గొన్నారు. వార్డు మాజీ కౌన్సిలర్ శ్రీదేవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్లు లబ్ధిదారుల ఇంటి వద్దకే చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.4 వేల నుంచి రూ.15 వేల వరకు వివిధ వర్గాల లబ్ధిదారులకు పింఛన్లు అందిస్తున్నామని చెప్పారు.
వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ పింఛన్లు ఆర్థిక భరోసాగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. అందుకే ప్రతి గ్రామం, ప్రతి వార్డులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు భాగస్వాములవుతున్నారని చెప్పారు.
అనంతరం ఇందిరానగర్ ప్రాంతంలో రైల్వే లైన్ విస్తరణ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాల పరిస్థితిని మంత్రి పరిశీలించారు. రైల్వే ట్రాక్ సమీపంలో నివసిస్తున్న ప్రజల భద్రత, నివాస సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ అంశంపై ఇప్పటికే సంబంధిత అధికారులతో చర్చించామని, అర్హులైన పేదలకు టిడ్కో ఇళ్లు లేదా ప్రత్యామ్నాయ నివాస స్థలాల కేటాయింపుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లు తెలిపారు. నంద్యాలలో ప్రతి పేద కుటుంబానికి శాశ్వత నివాసం కల్పించాలన్నదే ప్రభుత్వ నిబద్ధత అని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్‌చార్జ్ వాకా శివశంకర్ యాదవ్, టీడీపీ నాయకులు జయప్రకాష్, తిమ్మయ్య, వెంకటసుబ్బయ్య, పుష్పరాజ్, కే. సుబ్బయ్య, ఈ. సుధాకర్, జి. వెంకటేశ్వర్లు, కే. శ్రీనివాసులు, జి. మధుమోహన్ రెడ్డి, రాము రాయల్, భూపాల్, సాల్మన్, దీపక్, చెన్నమ్మ, శ్రావణి, నిరంజన్, జేయుసేనయ్య, రామస్వామి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, శ్రీరాములు, గఫూర్, మున్సిపల్, రెవెన్యూ అధికారులు, పార్టీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
