న్యాయం కోసం బ్యాంకు ఎదుటే ఉద్యమబాట..

చెన్నూర్, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని ఎస్‌బీఐ బ్యాంకు బ్రాంచ్-2 ఎదుట గోల్డ్ లోన్ బాధితులు శనివారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. తమ బంగారం, నగదు తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేస్తూ బ్యాంకు ముందు టెంటు ఏర్పాటు చేసి ఆందోళన నిర్వహించారు.

గత ఏడాది ఆగస్టులో స్థానిక ఎస్‌బీఐ మేనేజర్, సహచర సిబ్బంది కలిసి ఖాతాదారులు బ్యాంకులో భద్రపరిచిన నగదు, నగలను అక్రమంగా అపహరించిన ఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులు వివిధ ప్రైవేట్ బ్యాంకుల్లో దాచిన సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకుని కోర్టుకు అప్పగించినట్లు బాధితులు తెలిపారు.

అయితే, ఘటన జరిగి దాదాపు ఏడాది గడుస్తున్నా తమకు న్యాయం జరగలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు అధికారులను, బ్యాంకు యాజమాన్యాన్ని సంప్రదించినా తమ బంగారాన్ని తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

ఈ సందర్భంగా పలువురు బాధితులు మాట్లాడుతూ, తమకు న్యాయం జరిగే వరకు రిలే నిరాహార దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎస్‌బీఐ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి బాధితులకు చెందిన బంగారం, నగదును తిరిగి అందజేయాలని కోరారు.

అలాగే, కోర్టు ప్రక్రియల పేరుతో కాలయాపన చేయడం మానుకోవాలని, తనఖా పెట్టిన బంగారాన్ని తక్షణమే అప్పగించాలని డిమాండ్ చేశారు. తీసుకున్న రుణాల్లో 50 శాతం మాఫీ చేయడంతో పాటు, వడ్డీ అంశంపై కూడా న్యాయం చేయాలని కోరారు.

ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. బ్యాంకు ఎదుట నినాదాలు చేస్తూ తమ ఆందోళన కొనసాగించారు.

Leave a Reply