Karnataka politics | కాంగ్రెస్ వ్యూహాత్మక స్క్రిప్ట్‌గా అధికార మార్పు

Karnataka politics | కాంగ్రెస్ వ్యూహాత్మక స్క్రిప్ట్‌గా అధికార మార్పు

Karnataka politics | మూడేళ్ల సస్పెన్స్ డ్రామాకు తెర
సిద్ధరామయ్యకు ప్రత్యేక రాజకీయ గుర్తింపు
2028 ఎన్నికలే కాంగ్రెస్ అసలు లక్ష్యం

Karnataka politics | కర్ణాటక రాజకీయాల్లో గత మూడు సంవత్సరాలుగా నడుస్తున్న సస్పెన్స్ డ్రామాకు ఎట్టకేలకు తెరపడింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయగా, ఎన్నాళ్లుగానో ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్న డీకే శివకుమార్ రాష్ట్ర పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. బయటకు చూస్తే ఇది సాధారణ అధికార మార్పిడిలా కనిపించవచ్చు. కానీ రాజకీయ తెర వెనుక జరిగిన పరిణామాలను పరిశీలిస్తే, ఇది కాంగ్రెస్ అధిష్టానం ముందుగానే రచించిన వ్యూహాత్మక స్క్రిప్ట్‌గా కనిపిస్తోంది.

2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన రోజు నుంచే ఈ కథ ప్రారంభమైంది. బీజేపీని ఓడించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆనందం ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి పదవి విషయంలో ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో మాస్ లీడర్‌గా గుర్తింపు పొందిన సిద్ధరామయ్య ఒకవైపు ఉంటే, పార్టీని కష్టకాలంలో గట్టెక్కించిన ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ మరోవైపు నిలిచారు. ఇద్దరూ సీఎం పదవికి అర్హులేననే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమైంది.

ఇద్దరిలో ఎవరినీ నిరాశపరచలేని పరిస్థితి కాంగ్రెస్ అధిష్టానానికి ఏర్పడింది. అప్పుడు ఢిల్లీలో జరిగిన చర్చల్లో ఒక రాజీ ఫార్ములా కుదిరిందనే వార్తలు వెలువడ్డాయి. తొలి అర్ధకాలం సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా కొనసాగడం, మిగిలిన కాలానికి డీకే శివకుమార్‌కు అవకాశం ఇవ్వడం ఆ ఫార్ములా సారాంశంగా ప్రచారంలోకి వచ్చింది. ఆ సమయంలో దానిపై అధికారికంగా ఎవరూ స్పందించకపోయినా, నేటి పరిణామాలు చూస్తుంటే ఆ ఒప్పందం అమలవుతున్నట్టే కనిపిస్తోంది.

సిద్ధరామయ్యకు ఇది రాజకీయ విరమణ కాదు. కర్ణాటక కాంగ్రెస్‌లో ఆయన ఇప్పటికీ అత్యంత ప్రభావవంతమైన నాయకుడు. సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు చేరువైన రాజకీయ శైలి, సామాజిక న్యాయంపై ఆయనకున్న నిబద్ధత వల్ల ఆయన ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ముఖ్యంగా 2013 నుంచి 2018 వరకు పూర్తి ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసి అరుదైన ఘనత సాధించారు. కర్ణాటక రాజకీయాల్లో పూర్తి కాలం ముఖ్యమంత్రిగా కొనసాగడం అంత సులభం కాదు. అందుకే సిద్ధరామయ్య పేరు రాష్ట్ర రాజకీయ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయింది.

అసలు కర్ణాటక ముఖ్యమంత్రి కుర్చీకి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. ఈ రాష్ట్రంలో అధికార మార్పులు, రాజకీయ సమీకరణాలు, సంకీర్ణ ప్రభుత్వాలు, అంతర్గత విభేదాలు ఎప్పుడూ రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగిన 1956 తర్వాత పూర్తి ఐదేళ్ల పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసిన నాయకులు కేవలం ముగ్గురు మాత్రమే. కాంగ్రెస్ నేత ఎస్. నిజలింగప్ప 1962 నుంచి 1968 వరకు అధికారంలో కొనసాగారు. అనంతరం డి. దేవరాజ్ ఉర్స్ 1972 నుంచి 1977 వరకు పూర్తి కాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు. తర్వాత దాదాపు నాలుగు దశాబ్దాల అనంతరం సిద్ధరామయ్య ఆ జాబితాలో చేరారు.

అదే సమయంలో అతి తక్కువ కాలం ముఖ్యమంత్రులుగా కొనసాగిన నేతల కథలు కూడా కర్ణాటక రాజకీయ చరిత్రలో భాగమే. 2007లో బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్ప కేవలం వారం రోజులపాటు మాత్రమే ముఖ్యమంత్రిగా కొనసాగారు. బీజేపీ-జేడీఎస్ మధ్య కుదిరిన అధికార భాగస్వామ్య ఒప్పందం విఫలమవడంతో ప్రభుత్వం కూలిపోయింది. 1971లో వీరేంద్ర పాటిల్ రాజీనామా చేసిన తర్వాత ఎస్.ఆర్. కాంతి కొన్ని వారాలపాటు మాత్రమే ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహించారు. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించిన ధరమ్ సింగ్ కూడా కూటమి విభేదాల కారణంగా పూర్తి కాలం కొనసాగలేకపోయారు. అలాగే 2012లో ముఖ్యమంత్రి అయిన జగదీశ్ శెట్టర్ కేవలం 305 రోజులకే తన పదవీకాలాన్ని ముగించారు.

అందుకే కర్ణాటక రాజకీయాలను చాలామంది “మ్యూజికల్ చెయిర్స్ పాలిటిక్స్”గా అభివర్ణిస్తుంటారు. రాజకీయ సమీకరణాలు మారినప్పుడల్లా నాయకత్వం కూడా మారుతూ వచ్చింది. అయితే డీకే శివకుమార్‌కు దక్కింది కేవలం పదవి మాత్రమే కాదు. ఒక భారీ రాజకీయ బాధ్యత కూడా. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఆశలు ఇప్పుడు ఆయన భుజాలపై నిలిచాయి. పార్టీని మరోసారి విజయపథంలో నడిపించాల్సిన బాధ్యత ఆయనదే. ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో నమ్మకం పెంచడం, పార్టీ శ్రేణుల్లో ఐక్యతను కాపాడటం, సిద్ధరామయ్య వర్గాన్ని సంతృప్తిపరచడం, బీజేపీ-జేడీఎస్ సవాళ్లను ఎదుర్కోవడం వంటి కీలక అంశాలు ఆయన ముందున్నాయి.

ఈ అధికార మార్పు వెనుక మరో ముఖ్యమైన రాజకీయ వ్యూహం రానున్న ఎన్నికల ప్రణాళిక కూడా ఉంది. కర్ణాటక రాజకీయాల్లో కుల సమీకరణాలు అత్యంత ప్రభావవంతమైన అంశం. సిద్ధరామయ్య ఓబీసీ వర్గానికి చెందిన నాయకుడు కాగా, డీకే శివకుమార్ ప్రభావవంతమైన వొక్కలిగ సమాజానికి చెందిన నేత. ముఖ్యంగా పాత మైసూరు ప్రాంతంలో వొక్కలిగ ఓటు బ్యాంక్ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉంటుంది. డీకేకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ద్వారా ఆ వర్గంలో కాంగ్రెస్ తన పట్టును మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇక కాంగ్రెస్ అధిష్టానం కూడా తక్షణ రాజకీయాలకే పరిమితం కాలేదు. ఈరోజు జరిగిన అధికార మార్పు వెనుక అసలు లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని స్పష్టమవుతోంది. కొత్త నాయకత్వం, కొత్త రాజకీయ సమీకరణాలు, కొత్త వ్యూహాలతో ఎన్నికల్లోకి వెళ్లాలని పార్టీ భావిస్తోంది. డీకే శివకుమార్ నాయకత్వం పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని, యువతను ఆకర్షిస్తుందని కాంగ్రెస్ వర్గాలు విశ్వసిస్తున్నాయి.

మొత్తానికి కర్ణాటకలో జరిగిన ఈ పరిణామం ఒక సాధారణ రాజీనామా కథ కాదు. ఇది మూడేళ్ల క్రితం ప్రారంభమైన రాజకీయ కథకు వచ్చిన క్లైమాక్స్. ఒక నాయకుడు అధికార పీఠం దిగుతుంటే, మరో నాయకుడు అధికార పీఠం ఎక్కుతున్న సందర్భం. కానీ రాజకీయ కథ అక్కడితో ముగిసిపోలేదు. అసలు కథ ఇప్పుడు ప్రారంభమైంది. డీకే శివకుమార్‌కు దక్కిన ఈ కుర్చీ కేవలం రెండేళ్ల అధికారానికి పరిమితమవుతుందా? లేక 2028 ఎన్నికల తర్వాత కూడా ఆయన నాయకత్వమే కొనసాగుతుందా? అన్న ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజుల్లో కర్ణాటక రాజకీయాలే చెప్పనున్నాయి.

– వాడవల్లి శ్రీధర్

Leave a Reply