ధాన్యం నిర్వహణపై క్షేత్రస్థాయిలో సమీక్ష..

ఖానాపూర్ రూరల్, ఆంధ్రప్రభ : రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు, నిల్వ ప్రక్రియలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఖానాపూర్ మండలంలోని సత్తెనపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రామ్‌రెడ్డిపల్లి హాబిటేషన్‌లో ఉన్న ప్యాడీ ఏఆర్‌ఎస్ గోదామును అదనపు జిల్లా కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్‌తో కలిసి జిల్లా కలెక్టర్ శుక్రవారం ఉదయం పరిశీలించారు.
ఈ సందర్భంగా గోదాంలో నిల్వ ఉంచిన ధాన్యం, నిర్వహణ విధానం, అందుబాటులో ఉన్న సౌకర్యాలపై అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా కొనసాగాలని, రైతులు తీసుకువచ్చే ధాన్యాన్ని త్వరితగతిన స్వీకరించి నిల్వ చేయాలని అధికారులకు సూచించారు.
గోదాంలో భద్రతా ఏర్పాట్లు, రికార్డుల నిర్వహణ, తేమ శాతం పరిశీలన, నిల్వ సదుపాయాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించి అవసరమైన సూచనలు చేశారు.
ధాన్యం నిల్వలో నాణ్యత ప్రమాణాలను పాటించాలని, కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుజాత రెడ్డి, ఎంపీడీవో సీహెచ్ రాధా రాథోడ్, ఎంపీవో రత్నాకర్ రావు, సత్తెనపల్లి గ్రామ కార్యదర్శి రంజిత్, గోదాం ఇన్‌చార్జీలు విట్టల్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
