ఎండల హెచ్చరిక వెనుక పెరుగుతున్న ఆందోళన

ఖమ్మం బ్యూరో, ఆంధ్రప్రభ: జిల్లాలో తీవ్ర ఎండలు, వడగాలులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ సూచించారు. ఈ మేరకు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పలు జాగ్రత్తలను వివరించారు.

జిల్లాలోని పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున, ముఖ్యంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచించారు.

వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉండటంతో తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు.

ప్రజలు తరచుగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, నిమ్మరసం వంటి ద్రవ పదార్థాలను తీసుకోవాలని సూచించారు. పుచ్చకాయ, దోసకాయ వంటి నీటి శాతం అధికంగా ఉండే పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని తెలిపారు.

బయటకు వెళ్లే సమయంలో గొడుగు, టోపీ, తడి గుడ్డ వంటివి ఉపయోగించాలని, పలుచటి, లేత రంగు దుస్తులు ధరించాలని సూచించారు. వీలైనంత వరకు చెట్ల నీడలో లేదా చల్లని ప్రదేశాల్లో విశ్రాంతి తీసుకోవాలని పేర్కొన్నారు.

భారీ భోజనాలు, మద్యం, కాఫీ వంటి డీహైడ్రేషన్‌కు దారితీసే పానీయాలను నివారించాలని తెలిపారు. చిన్నపిల్లలు, వృద్ధులను ఎండలో ఎక్కువసేపు ఉంచవద్దని హెచ్చరించారు. అలాగే పార్క్ చేసిన వాహనాల్లో పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా వదిలి పెట్టవద్దని సూచించారు.

వడదెబ్బ లక్షణాలైన అధిక జ్వరం, తలనొప్పి, తల తిరగడం, వాంతులు, అలసట, చెమట ఆగిపోవడం, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే బాధితులను చల్లని ప్రదేశానికి తరలించాలని తెలిపారు. చల్లటి నీటితో శరీరాన్ని తడపడంతో పాటు ఓఆర్‌ఎస్ ద్రావణం ఇవ్వాలని, అవసరమైతే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని సూచించారు.

ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply