వ్యక్తి గత స్వలాభం కోసం తప్పుడు ఆరోపణలు

వ్యక్తి గత స్వలాభం కోసం తప్పుడు ఆరోపణలు
భీమ్గల్ టౌన్ , ఆంధ్రప్రభ:
కాంగ్రెస్ పార్టీ గిరిజన నాయకుడు బాధవత్ గోపాల్ నాయక్ తన వ్యక్తిగత స్వలాభం కొరకు కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జి ముత్యాల సునిల్ కుమార్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని గిరిజన నాయకులు, గిరిజన సర్పంచులు అన్నారు. గురువారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గిరిజన నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా గోపాల్ నాయక్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
తనకు పదవి రాలేదని అక్కసుతో గిరిజనులను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం తగదని సూచించారు. ఇది పూర్తిగా గోపాల్ నాయక్ వ్యక్తిగతం అన్నారు. ఆయన నాయకులపై చేసిన ఆరోపణల్లో గిరిజనులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ నాయకుడిగా ఏనాడైనా గిరిజనుల సంక్షేమం కొరకు కృషి చేశాడా అని ప్రశ్నించారు. పదవి రాలేదనే గిరిజనులను రెచ్చ గొట్టడం, బీఆర్ఎస్ కు చెందిన కొందరు గిరిజన నాయకులను వెంటబెట్టుకుని ర్యాలీ తీయడం, బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునిల్ కుమార్ మండల అధ్యక్ష పదవి రూ 50 లక్షలకు అమ్ముకున్నాడని తప్పుడు ఆరోపణలు చేసి, దిష్టి బొమ్మ దహనం చేయడం కరెక్ట్ కాదన్నారు.
ఇలాంటి రెచ్చ గొట్టే చర్యల ద్వారా కాంగ్రెస్ పార్టీ ని దిగజార్చాలని చూస్తున్నాడని పేర్కొన్నారు. గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ తోనే మేలు జరిగిందని తెలిపారు. ఏ ఒక్కరికో పదవి రాలేదని గిరిజనులు కాంగ్రెస్ పార్టీ కి దూరం కారనే విషయం గమనించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ లో కష్ట పడ్డ వారికి పదవులు వాటికి అవే వెతుక్కుంటూ వస్తాయని తెలిపారు. ఎస్టీ సెల్ అధ్యక్షులుగా, గిరిజన నాయకుడిగా గిరిజనుల అభివృద్ధి కొరకు గోపాల్ నాయక్ చేసింది ఏమి లేదని పైగా గిరిజనులను అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ ను బద్నామ్ చేయాలని చూస్తే సహించేది లేదని, వెంటనే ముత్యాల సునిల్ కుమార్ తో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగేష్ రెడ్డి కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు పాల్త్య శివ నాయక్ ,రాజిరెడ్డి,వసందర్, ఉప సర్పంచులు మాలవత్ అజయ్ ,గణేష్ దేగావత్,సేవలాల్ , రాములు ఎంజీ తండా గ్రామ అధ్యక్షుడు, భూక్యా సర్దార్, మాజీ ఎంపీటీసీ కేతవత్ వల్లీ,కాంగ్రెస్ పార్టీ బంజారా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
