ఇంధన పొదుపుతో దేశాభివృద్ధికి చేయూత

ఇంధన పొదుపుతో దేశాభివృద్ధికి చేయూత
-కృష్ణా మిల్క్ యూనియన్లో ‘సేవ్ ఫ్యూయల్’ ఉద్యమానికి శ్రీకారం
-400 మంది సిబ్బంది సైకిళ్లు, నడక, ప్రజా రవాణాతో విధులకు హాజరు
-ప్రతి గురువారం సామాజిక బాధ్యతగా కార్యక్రమం కొనసాగింపు
విజయవాడ, ఆంధ్రప్రభ:
దేశ భవిష్యత్తు కోసం ఇంధన పొదుపు ప్రతి పౌరుడి బాధ్యత అనే సందేశంతో కృష్ణా మిల్క్ యూనియన్ సరికొత్త అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు ఇచ్చిన “సేవ్ ఫ్యూయల్ ఫర్ ఏ స్ట్రాంగర్ ఫ్యూచర్” పిలుపుకు విశేష స్పందన లభించింది.
గురువారం ఉదయం విజయవాడలోని కృష్ణా మిల్క్ యూనియన్ మిల్క్ ఫ్యాక్టరీలో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది కలిపి సుమారు 400 మంది వ్యక్తిగత వాహనాలను పక్కన పెట్టి సైకిళ్లు, నడక, ప్రజా రవాణా వాహనాల ద్వారా విధులకు హాజరయ్యారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన వినియోగ నియంత్రణ లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంతో సంస్థలో ప్రత్యేక చైతన్యాన్ని తీసుకొచ్చింది.
అలాగే వీరవల్లి ఫ్యాక్టరీలో విధులు నిర్వహించే సిబ్బంది కూడా వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి, విజయవాడ నుంచి సమితి బస్సులో ప్రయాణించి విధులకు హాజరుకావడం విశేషంగా నిలిచింది.
ఈ సందర్భంగా ఛైర్మన్ చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ, “మనకు కన్నతల్లి ఎంత గొప్పదో, మన దేశం కూడా అంతే గొప్పది. ప్రస్తుత యుద్ధ వాతావరణం, క్లిష్ట పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇంధన పొదుపు అత్యవసర బాధ్యతగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో ప్రతి గురువారం నిబద్ధతతో కొనసాగిస్తాం” అని తెలిపారు.
మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ, “ఇంధన పొదుపు కేవలం ఆర్థిక ప్రయోజనం మాత్రమే కాదు.. దేశ భవిష్యత్తును కాపాడే సామాజిక బాధ్యత కూడా. సమితి సిబ్బంది ఈ కార్యక్రమాన్ని ఆదర్శంగా కొనసాగించడం అభినందనీయం” అని పేర్కొన్నారు.
సిబ్బందిలో దేశభక్తి, సామాజిక బాధ్యత, పర్యావరణ చైతన్యాన్ని పెంపొందించే దిశగా కృష్ణా మిల్క్ యూనియన్ చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం ఇతర సంస్థలకు సైతం ఆదర్శంగా నిలుస్తోందని పలువురు అభిప్రాయపడ్డారు.
