సర్వజన ఆసుపత్రిలో సౌకర్యాల విస్తరణకు చర్యలు.

సర్వజన ఆసుపత్రిలో సౌకర్యాల విస్తరణకు చర్యలు.

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : మంత్రి టీజీ భరత్.

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ప్రజలకు సంతృప్తికరమైన వైద్య సేవలు అందేలా అన్ని మౌలిక సదుపాయాలను సమకూర్చుతున్నామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం,ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధి, రోగులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. మంగళవారం ఉదయం కర్నూలు మెడికల్ కాలేజీ సమావేశ మందిరంలో మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ, సర్వజన ఆసుపత్రి డెవలప్‌మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలు, అవసరమైన మౌలిక సదుపాయాలపై సమీక్ష నిర్వహించి పలు కీలక సూచనలు జారీ చేశారు. ఇటీవల మార్చురీలో డబ్బులు వసూలు చేస్తున్నారన్న అంశం మీడియా ద్వారా తెలిసిందని మంత్రి పేర్కొన్నారు. విచారణలో గత 15 సంవత్సరాలుగా ఎటువంటి జీతభత్యాలు లేకుండా పనిచేస్తున్న వ్యక్తులే ఈ సేవలు అందిస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. వెంటనే వారిని ఔట్‌సోర్సింగ్ విధానంలో పారిశుద్ధ్య కార్మికులుగా నియమించి జీతభత్యాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు.

ప్రభుత్వాసుపత్రిలో ఉన్న సుమారు 400 ఎయిర్ కండీషనర్లలో 300 పాతబడిపోయి తరచూ మరమ్మతులు అవసరమవుతున్నాయని మంత్రి గుర్తించారు. దశలవారీగా కొత్త ఏసీలు ఏర్పాటు చేయడంతో పాటు, ఏఎంసీ ద్వారా మరమ్మతులు చేపట్టాలని సూచించారు. అవసరమైన చోట్ల అదనపు ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. కోవిడ్ సమయంలో ఏర్పాటు చేసిన ఏడు ఆక్సిజన్ ప్లాంట్లను తిరిగి పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

ఆసుపత్రి పరిశుభ్రత విషయంలో రాజీ పడొద్దని, కాంట్రాక్టర్ సిబ్బంది సమర్థంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఐవీఆర్‌ఎస్ ద్వారా ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చేలా సేవల నాణ్యత మెరుగుపరచాలని ఆదేశించారు.

నర్సింగ్ సిబ్బంది సేవలను సున్నితమైన విభాగాల్లో సమర్థంగా వినియోగించేందుకు అవసరమైన మార్పులు చేయాలని సూచించారు. ఆసుపత్రికి అవసరమైన వెంటిలేటర్లు, లైఫ్ సపోర్టింగ్ పరికరాలు, అదనపు బెడ్లు, ట్రాలీలు తదితర సామగ్రి సమకూర్చుతామని తెలిపారు. జనరేటర్లు ఆటోమేటిక్ విధానంలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని, 50 సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని పేర్కొన్నారు. అన్ని స్కానింగ్ పరికరాలు ఎప్పటికప్పుడు పనిచేసేలా ఏఎంసీ నిర్వహణ ఉండాలని ఆదేశించారు.

1956లో నిర్మించిన శుశ్రుత భవనంలో అందిస్తున్న వైద్య సేవలను వీలైనంత త్వరగా ఐపీడీ భవనానికి తరలించాలని మంత్రి సూచించారు. రోగుల సహాయకుల కోసం నిర్మించనున్న విశ్రాంతి సదన్ పనులను వేగవంతం చేయాలని, ఆసుపత్రిలో పేరుకుపోయిన గడువు ముగిసిన మందులను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, మెడికల్ కాలేజీల అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో పరిష్కారం కావాల్సిన అంశాలను వెంటనే తన దృష్టికి తీసుకురావాలని మంత్రి అధికారులను కోరారు.

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ సమావేశంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ చిట్టి నరసమ్మ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేశ్వరరావు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మి, అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం, హాస్పిటల్ డెవలప్‌మెంట్ కమిటీ సభ్యులు, వైద్యాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply