బిడ్డ మృతిని జీర్ణించుకోలేక తండ్రి ఆత్మహత్య

బిడ్డ మృతిని జీర్ణించుకోలేక తండ్రి ఆత్మహత్య
కోసిగి, ఆంధ్రప్రభ : ఉన్న ఒక్కగాన ఒక్క బిడ్డా అనారోగ్యంతో మృతి చెందడాన్ని జీర్ణించుకోలేని తండ్రి మనోవేదనకు గురై ,మద్యానికి బానిసగా మారి అప్పుల పాలై పురుగుల మందు సేవించి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన కోసిగిలో చోటుచేసుకుంది. కోసిగి గ్రామంలోని కొండనగేరి వీధికి చెందిన మంగలి అశోక్ (32) కు భార్య ఒక కుమార్తె ఉన్నారు. ఉన్న కుమార్తె పుట్టుకతోనే వికలాంగురాలు. కుమార్తె చికిత్స నిమిత్తం కుటుంబం అప్పులు చేయవలసి వచ్చినది. అనంతరం కుమార్తె ఆరోగ్య సమస్యలతో సుమారు 10 నెలల క్రితం మరణించగా, ఆ ఘటనతో అశోక్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.
అదే సమయంలో మద్యం సేవించడం అలవాటు చేసుకొని, చేసిన అప్పులు తీర్చలేక ఆర్థిక ఇబ్బందులతో తరచూ బాధపడుతూ ఉండేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు.ఈ క్రమంలో గత నెల 24 తేదీన కోసిగి ఆర్ టి సి బస్టాండ్ సమీపంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్య యత్నం కు పాల్పడగా అశోక్‌ను కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే 108 అంబులెన్స్ ద్వారా ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుదవారం తెల్లవారు జామున మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించి నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో కోసిగిలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు కోసిగి ఎస్సై రమేష్ రెడ్డి తెలిపారు.
