American Dream Collapse | అమెరికా ఆర్థిక పరిస్థితులపై ఆందోళన

American Dream Collapse | అమెరికా ఆర్థిక పరిస్థితులపై ఆందోళన

American Dream Collapse | అమెరికాలో భారతీయుల చరిత్ర
అమెరికన్‌ డ్రీమ్‌ కోసం భారతీయుల ప్రయాణం
అమెరికాలో భారతీయుల విజయగాథ
భారతీయ అమెరికన్లలో పెరుగుతున్న అసంతృప్తి
ట్రంప్‌ విధానాలపై భారతీయుల ఆందోళన
జాత్యహంకార వ్యాఖ్యలపై విమర్శలు

American Dream Collapse | కష్టాల కన్నీళ్లను వేటితో కొలుస్తారో తెలియదు.. కానీ కొలమానముంటే అందరికంటే ఎక్కువ కష్టాల కన్నీళ్లు అమెరికాలోని భారతీయులకే. భారతీయుల అమెరికా ప్రయాణాన్ని పరిశీలించినట్లయితే, 1635లో మన దేశం నుండి జేమ్స్‌ టౌన్‌, వర్జినియా, అమెరికాకు మొదట వలస పోయిన వ్యక్తి ”టామ్‌” (హడ్‌ రైట్‌) అని నమోదు చేయబడింది. 1680లో భారత సంతతి వ్యక్తి పీటర్‌ మరియు ఐరిష్‌ మహిళలకు జన్మించిన మేరీ ఫిషర్‌ స్థిరనివాసం పొందినట్లు తెలుస్తుంది. 1790లో మద్రాస్‌కు చెందిన థామస్‌ మసాచూసెట్స్‌ను దర్శించాడట. 1910లో బొంబాయికి చెందిన బికాజి ఫ్రావ్జి బల్సారా అనే పార్షి తొలి సహజ పౌరసత్వం పొందిన భారతీయుడు. 17, 18వ శతాబ్దాలలో చాలామంది భారతీయులు నావికులుగా, బ్రిటిష్‌ అధికారులకు సేవకులుగా పనిచేసినప్పటికీ అధికారికంగా నమోదు చేయబడలేదు.

అమెరికన్‌ డ్రీమ్‌, వృత్తిపరమైన నైపుణ్యాభివృద్ధి సాధించాలనే తపనతో, భారత్‌లో ఉన్న విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలలో ఉన్న అధిక పోటీ నుండి తప్పించుకొని, ఉత్తమ నైపుణ్యం కలిగిన ఐటీ, ఆరోగ్య సంరక్షణ, కార్మిక నిపుణులు విజయవంతమైన భవిష్యత్తును నిర్మించుకునేందుకు హెచ్‌1బీ వీసాలను ఉపయోగించుకుంటున్నారు.

2025-26 సమాచారం మేరకు వీరిలో ప్రముఖంగా ఉన్నటువంటి బిలియనీర్లు జై చౌదరి (స్కేలర్‌) 17.9 బిలియన్‌ డాలర్లు, భారత సంతతి వారిలో అత్యంత ధనవంతుడు, వినోద్‌ ఖోస్లా (ఖోస్లా వెంచర్స్‌, సన్‌ మైక్రోసిస్టమ్స్‌) 9.2 బిలియన్‌ డాలర్లు, రాకేష్‌ గంగ్వాల్‌ (ఇండిగో ఎయిర్‌లైన్స్‌) 6.6 బిలియన్‌ డాలర్లు, రోమేష్‌ టి వాద్వానీ (సింఫనీ టెక్నాలజీ గ్రూప్‌) 5.0 బిలియన్‌ డాలర్లు, నీరజా సేథి (సింటెల్‌ సహవ్యవస్థాపకురాలు) 1 బిలియన్‌ డాలర్లు, నేహా నారాడే (కాన్ఫ్లూయెంట్‌ సహవ్యవస్థాపకురాలు), జయ శ్రీ ఉల్లాల్‌ (అరిస్టా నెట్‌వర్క్స్‌) మొదలైన పారిశ్రామికవేత్తలు, సీఈవోలు సత్య నాదెళ్ల (మైక్రోసాఫ్ట్‌), సుందర్‌ పిచాయి (ఆల్ఫాబెట్‌ గూగుల్‌), అరవింద్‌ కృష్ణ (ఐబీఎం), శంతను నారాయణ (అడోబ్‌), నీల్‌ మోహన్‌ (యూట్యూబ్‌) లాంటి మరెందరో ప్రముఖమైన వ్యక్తులు, రాజకీయ నాయకులను చూసినట్లయితే కమలా హారిస్‌, నిక్కీ హేలీ, వివేక్‌ రామస్వామి, ప్రమీల జైపాల్‌, అమీ బేరా, రో ఖన్నా, రాజ కృష్ణమూర్తి, శ్రీ తానేదార్‌, సుభాష్‌ సుబ్రహ్మణ్యం, గజాల హస్మి, విన్‌ గోపాల్‌ మొదలైన వారితో పాటు 16 ఫార్చ్యూన్‌-500 కంపెనీలకు భారతీయ సీఈఓలు నాయకత్వం వహిస్తున్నారు. 72 యూనికార్న్‌ కంపెనీలకు భారతీయులు నేతృత్వం వహిస్తున్నారు. భారతీయ సంతతి కుటుంబాల సగటు ఆదాయం అత్యధికం 1,19,000 అమెరికా డాలర్లు.

2026 నాటికి అమెరికాలో 54 లక్షల (అమెరికాలో జన్మించిన మరియు వలస వచ్చిన)కు పైగా భారత సంతతి ప్రజలు నివసిస్తున్నారు. ఇందులో భారతీయ సంతతి వలసదారులు 32 లక్షలకు పైగా, అమెరికా జనాభాలో 1.5 శాతం సంఖ్యా, ఆర్థికపరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆసియా సమూహాలలో మనమొకరం. కాలిఫోర్నియా, టెక్సాస్‌, న్యూ జెర్సీ, న్యూయార్క్‌లలో భారత సంతతి ప్రజలెక్కువ. అమెరికాలో 10 శాతం భారతీయ వైద్యులే పనిచేస్తున్నారు.

కార్నెగి నిర్వహించిన సర్వేలో అమెరికా వీడాలని అక్కడి భారత సంతతిలోని 40 శాతం మంది కోరుకుంటున్నట్లు వెల్లడించింది. ఒకప్పుడు అమెరికాలో ఉద్యోగం సంపాదించడం, స్థిర నివాసం ఏర్పరచుకోవడం భారతీయుల కల, కానీ ప్రస్తుతం ఆ కల నెమ్మదిగా చెదిరిపోతోంది. యూగవ్‌, కార్నెగి ఎండోమెంట్స్‌ సంస్థ 1000 మంది భారతీయులను సర్వే చేసి అభిప్రాయం సేకరించగా 40 శాతం భారతీయ అమెరికన్లు మళ్లీ మేము భారత్‌ వెళ్లిపోతామని వెల్లడించగా, 14 శాతం మంది వెళ్లిపోవాలని తరచుగా ఆలోచిస్తున్నామని, 28 శాతం మంది అప్పుడప్పుడు అలా అనిపిస్తుందని చెప్పారు.

ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ విధానాలపై 58 శాతం మంది తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు. పెరిగిన జీవన వ్యయాన్ని భరించలేకపోతున్నామని 54 శాతం మంది వెల్లడించారు. రోజు రోజుకు వ్యక్తిగత భద్రత కష్టంగా ఉందని 41 శాతం మంది చెప్పారు. మొదటిసారి ట్రంప్‌ అధ్యక్షుడైనప్పుడు భారత పక్షపాతిగా భావించారు కానీ 2వ సారి అధ్యక్షుడయ్యాక ఆర్థిక వ్యవస్థ నిర్వహణ, వలస విధానాలు, అంతర్జాతీయ సంబంధాల్లో ప్రభుత్వ నిర్ణయాలు తమకు నచ్చడం లేదని 71 శాతం మంది ప్రకటించారు.

ట్రంప్‌ జాత్యహంకార మాటలు మాట్లాడుతూ, అమెరికన్స్‌ ఫస్ట్‌ అంటూ, మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌ (అమెరికాను మళ్ళీ గొప్పగా చేయండి) అని రకరకాలుగా ప్రకటనలు చేస్తూ అమెరికన్లనే కాకుండా అమెరికాలో స్థిరపడిన, పనిచేస్తున్న, చదువుకుంటున్న విదేశీయులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ట్రంప్‌కు అమెరికా ప్రజల్లో 38 శాతంగా ఉన్న ఆదరణ 30 శాతానికి పడిపోయిందని విశ్లేషకులు చెప్పగా, రాయిటర్స్‌ ఇప్సోస్‌-35 శాతం, ఏపీ-ఎన్‌ఓఆర్‌సీ సెంటర్‌ ఫర్‌ పబ్లిక్‌ అఫైర్స్‌ రీసెర్చ్‌-35 శాతం, స్ట్రెంత్‌ ఇన్‌ నంబర్స్‌ వెరా సైట్‌-33 శాతం వరకు క్రమంగా ప్రజల మద్దతు తగ్గిపోయిందని ఈ సంస్థలు విడివిడిగా నిర్వహించిన సర్వేలలో తెలిపాయి.

ఇరాన్‌తో యుద్ధం, పడిపోతున్న ఆర్థిక వ్యవస్థల నిర్వహణ, వలసలు వంటి విషయాలలో ట్రంప్‌ తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజామోదం లేదని పైన పేర్కొన్న 3 సంస్థలు తెలిపాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో అమెరికన్లకు అసంతృప్తి అధికంగా ఉన్నట్లున్నది. అమెరికా ఆర్థిక వ్యవస్థ దారుణంగా ఉందని తాము నిర్వహించిన సర్వేలో పాల్గొన్న 70 శాతం మంది ప్రజలు తెలిపినట్లు ఏపీ ఎన్‌ఓఆర్‌సీ సంస్థ వెల్లడించింది. దేశం సరైన పంథాలో సాగడం లేదని 72 శాతం మంది అభిప్రాయపడినట్లు తెలియజేసింది. ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో మార్చి నెలలో ట్రంప్‌కున్న ప్రజాదరణ 38 శాతం.. కానీ, ఏప్రిల్‌ వచ్చేసరికి అది కాస్త 30 శాతానికి పడిపోయింది. జీవన వ్యయం విషయంలో కేవలం 23 శాతం మంది మాత్రమే ట్రంప్‌కు అనుకూలం, 76 శాతం మంది ట్రంప్‌ విధానాలను వ్యతిరేకిస్తున్నారు.

భారత్‌ నుండి అమెరికా వెళ్లే వారిని అన్ని మాఫియా గ్యాంగ్‌స్టర్ల కంటే ఎక్కువ నష్టం చేసి, మనల్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా చేసి దోచుకొని అమెరికాకు నష్టం కలిగిస్తున్న ”గ్యాంగ్‌ స్టర్స్‌ విత్‌ ల్యాప్‌టాప్‌” అని, మైకేల్‌ శావెజ్‌ అనే రాజకీయ విశ్లేషకుడు చేసిన పాడ్‌కాస్ట్‌ను ట్రంప్‌ సొంత సామాజిక మాధ్యమమైన ట్రూత్‌ సోషల్‌లో రీపోస్ట్‌ చేశాడు. దాదాపు 10 నిమిషాల నిడివిగల వీడియోలో జాత్యహంకారపూరిత వ్యాఖ్యలు చేశాడు. మన జెండాను కాలరాశారు. చైనా/ఇండియా నుండి తమ పిల్లలు అమెరికాలో పుట్టేలా 9 నెలల గర్భంతో ఉన్న వారిని ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఫలితంగా ఇక్కడ పుట్టి అమెరికా జాతీయ పౌరులైపోతున్నారు. ఇక్కడ పుట్టిన బేబీకి చట్టబద్ధంగా పొందే పౌరసత్వాన్ని ఆధారంగా చేసుకుని తమ మొత్తం కుటుంబాన్ని భారత్‌/చైనా నుండో, భూగోళం పైనున్న మరో నరకప్రాయ దేశం నుండి ఇక్కడికి తెస్తారు.

అందుకే ”అమెరికా బర్త్‌ రైట్‌ సిటిజన్‌షిప్‌” (జన్మత: పౌరసత్వ చట్టం)లో మార్పు చేయాలని, ఈ అంశాన్ని కోర్టుకు వదిలేయకుండా జాతీయస్థాయిలో రెఫరెండం (ప్రజాభిప్రాయ సేకరణ) చేయాలని, ఇంటర్నెట్‌, టీవీ, మొబైల్‌ ఫోన్‌, విమానాలు లేనప్పుడు ఆ పరిస్థితులకనుగుణంగా రాసిన అమెరికా రాజ్యాంగాన్ని సవరించాలని పేర్కొన్నాడు.

ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే వాక్‌ స్వతంత్రం ప్రకారం తన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వెలువరించిన ఒక రాజకీయ విశ్లేషకుని పోస్టును బాధ్యత గల అమెరికా అధ్యక్షుడు రీపోస్ట్‌ చేయడమంటే ఆ అధ్యక్షుని మదిలో విదేశీయులపై ఉన్న దురాభిప్రాయం ఇట్టే తెలిసిపోతోంది.

డా. కావలి చెన్నయ్య
9000481768

Leave a Reply