ఉన్నత ప్రమాణాలతో విద్యను అందించ‌డ‌మే ల‌క్ష్యం

ఉన్నత ప్రమాణాలతో విద్యను అందించ‌డ‌మే ల‌క్ష్యం

  • టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలజగ్గారెడ్డి

సంగారెడ్డి ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ‌ : ఉన్నత ప్రమాణాలతో విద్యను అందించ‌డ‌మే ప్ర‌భుత్వ‌ ల‌క్ష్యమ‌ని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) చైర్‌పర్సన్ నిర్మలజగ్గారెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని చారిత్రాత్మక కోఠి ఉమెన్స్ కళాశాల, ప్రస్తుతం వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో నూతనంగా నిర్మించిన సైన్స్ బ్లాక్‌ను ఆమె ప్రారంభించారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు కాల్వ సుజాత, మెట్టు సాయికుమార్ పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా నూతన సైన్స్ బ్లాక్‌ను నిర్మలాజగ్గారెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. మహిళా విద్యార్థినులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో ఆధునిక ల్యాబ్ సదుపాయాలతో ఈ భవనాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కోఠి ఉమెన్స్ కళాశాలను వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మార్పులో భాగంగా విద్యా ప్రమాణాల పెంపు కోసం కొత్త భవనాలు, మౌలిక వసతుల అభివృద్ధి చేపడుతున్నారు.

ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ మహిళా విద్యాభివృద్ధి, మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మహిళా విద్యలో కోఠి ఉమెన్స్ కళాశాలకు ఉన్న విశిష్ట చరిత్రను గుర్తు చేశారు. విశ్వవిద్యాలయంగా అప్‌గ్రేడ్ చేయడం ద్వారా మరిన్ని నిధులు, మౌలిక వసతులు సమకూరుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సూర్య ధనంజయ్ కార్పొరేషన్ చైర్మన్లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌తో పాటు బోధనా, బోధ‌నేత‌ర‌ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply