తొర్రూరులో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

తొర్రూర్ టౌన్, ఆంధ్రప్రభ : డివిజన్ కేంద్రంలోని తొర్రూరు శివారులో పాల కేంద్రం వద్ద ఉన్న భక్తాంజనేయ స్వామి మందిరంలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలను ఆలయ కమిటీ అధ్యక్షుడు రేగూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి ఉత్సవమూర్తి విగ్రహాన్ని రేగూరి శ్రీనివాస్ తన శిరస్సుపై మోసుకొని ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం అర్చకులు చైతన్య ఆధ్వర్యంలో మూలవిరాట్‌తో పాటు ఉత్సవమూర్తికి అష్టోత్తర శతనామావళి, ఆకు పూజ, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు.
పూజా కార్యక్రమంలో భాగంగా నాంచారి మడూరు గ్రామానికి చెందిన ఇమ్మడి రమేష్–కవిత దంపతులు ఆలయానికి అభిషేకం నిమిత్తం సహస్రధార కిరీటంతో పాటు పూజా సామగ్రిని ఆలయ కమిటీకి అందజేశారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పూర్ణచందర్, చిదిరాల శ్రీనివాస్, జగదీష్, గంగిశెట్టి రమేష్, కూన విజయ్, తమ్మి రమేష్, రేగూరి వెంకన్న, వడియాల సురేష్, దొడ్డ శ్రీనివాస్ తదితరులు కుటుంబ సమేతంగా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు రేగూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఒక భక్తుడు ప్రతిష్ఠించినప్పటికీ పూజా కార్యక్రమాలు సక్రమంగా జరగకపోవడంతో పాల కేంద్రం ప్రాంతానికి చెందిన మిత్రుల సహకారంతో ఆలయ అభివృద్ధికి ముందుకు వచ్చినట్లు తెలిపారు. సాయంత్రం పట్టణంలో శోభాయాత్ర నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అందరిపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు.
