ధాన్యం కొనుగోలుకు పక్కా ప్రణాళికతో జిల్లా యంత్రాంగం

ధాన్యం కొనుగోలుకు పక్కా ప్రణాళికతో జిల్లా యంత్రాంగం
- జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్
నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : రైతులు పండించిన ప్రతి గింజ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
మంగళవారం హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలు, వరి ధాన్యం సేకరణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దనసరి అనసూయ సీతక్క, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌర సరఫరాల శాఖ, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

నాగర్‌కర్నూల్ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ అదనపు కలెక్టర్ అమరేందర్, సంబంధిత శాఖల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. కొల్లాపూర్ నుంచి మంత్రి జూపల్లి కృష్ణారావు సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో సోమవారం నిర్వహించిన వరి కొనుగోళ్ల సమీక్ష సమావేశంలో పలు అంశాలపై చర్చించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా హమాలీలు, రవాణా సమస్యలను అధిగమించేందుకు మండల స్థాయిలో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేయాలని సూచించినట్లు చెప్పారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే సమాచారం అందుకుని పరిష్కారానికి చర్యలు తీసుకునేలా వ్యవస్థను రూపొందించినట్లు వివరించారు.

జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తున్నామని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోందన్నారు.
జిల్లాలో వరి, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు గత పది రోజులుగా విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు.
నాగర్‌కర్నూల్ మార్కెట్ యార్డును స్థానిక ఎమ్మెల్యే, పార్లమెంట్ సభ్యులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని తక్షణ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. జిల్లాలోని ప్రతి కొనుగోలు కేంద్రానికి ప్రత్యేక అధికారిని నియమించి, అక్కడ తలెత్తే సమస్యలను స్థానికంగానే పరిష్కరించేలా బాధ్యతలు అప్పగిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులు, గోదాములకు సమయానికి తరలించేందుకు అవసరమైన హమాలీలు, లారీలు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. తేమ పరీక్షలు, తూకం, చెల్లింపుల వ్యవస్థపై కూడా పటిష్ట పర్యవేక్షణ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
రైతులకు ఎలాంటి ఆలస్యం లేకుండా మద్దతు ధర చెల్లింపులు అందేలా చర్యలు తీసుకుంటున్నామని, కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన నగదు 48 గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమయ్యేలా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
