మద్యం మత్తు.. కార్మికుడి ప్రాణం తీసింది

మద్యం మత్తు.. కార్మికుడి ప్రాణం తీసింది

  • వలస కూలి దారుణ హత్య
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన

బూర్గంపాడు , ఆంధ్రప్రభ : కుటుంబాన్ని పోషించాలనే ఆశతో వేల కిలోమీటర్ల దూరంలోని బీహార్ రాష్ట్రం నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వచ్చిన ఓ యువ కార్మికుడు, మద్యం మత్తులో జరిగిన ఘర్షణకు బలై విగతజీవిగా మారిన ఘటన లక్ష్మీ పురం లారీయార్డు ప్రాంతంలో విషాదాన్ని నింపింది. బీహార్ కు చెందిన కుందన్ సింగ్ ఉపాధి కోసం బూర్గంపాడు ప్రాంతానికి వచ్చి పారిశ్రామిక ప్రాంతంలో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి అతను మరో ఇద్దరు సహచరులతో కలిసి మద్యం సేవిస్తున్న సమయంలో మాటామాటా పెరిగి వివాదంగా మారింది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఇద్దరు వ్యక్తులు కుందన్ సింగ్ పై దాడికి పాల్పడ్డారు. సమీపంలో ఉన్న బండరాయితో తలపై బలంగా మోదడంతో అతను అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. ఉపాధి కోసం వచ్చిన యువకుడు ఇంత దారుణంగా ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కలచివేసింది.

సోమవారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి పరాలీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనతో పారిశ్రామిక ప్రాంతాల్లో పని చేస్తున్న ఇతర రాష్ట్రాల కార్మికుల జీవన పరిస్థితులపై మరోసారి చర్చ మొదలైంది. కుటుంబాల కోసం కష్టపడుతున్న కార్మికులు మద్యం మత్తు, చిన్న చిన్న గోడవల కారణంగా ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి వారి కోసం సంపాదించాలనే ఆశతో వచ్చిన వ్యక్తి శవంగా తిరిగి వెళ్లాల్సి రావడం దురదృష్టకరం అంటూ సహచర కార్మికులు కన్నీరుమున్నీరయ్యారు. పారిశ్రామిక ప్రాంతాల్లో మద్యం, మత్తు పదార్ధాల నియంత్రణపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మత్తులో అసాంఘిక కార్యకలాపాలు
మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామం కేంద్రంగా ఉన్నటువంటి పలు ఫ్యాక్టరీలలో ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చి జీవనం సాగిస్తున్నారు. ఇదే అలుసుగా వారి అలవాట్లు తెలుసుకున్న కొందరు మాదక ద్రవ్యాలను అందించే కేటుగాళ్లు కల్తీమద్యం, నాటు సారా, గంజాయి వంటి మత్తు పదార్థాలే కాకుండా లారీ యార్డ్ ప్రాంతాలలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. లారీ యార్డ్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరిగి అనేక ప్రాణాలు బలిగొన్న విషయం విధితమే.

ట్రాఫిక్ నియమాలను పక్కనపెట్టి రోడ్లపై లారీలు పార్కింగ్ చేయడంతో ఎన్నో ప్రాణాలు గాలిలో కలిశాయి. అదేవిధంగా ఆ ప్రాంతంలో పలు మత్తు పదార్థాలు అమ్మకాలు జరుగుతూ అనేక గొడవలకు దారితీస్తూ ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్న సంఘటనలు జరుగుతూనే ఉన్నాయ్ అంటానికి నిదర్శనంగా ఆదివారం రాత్రి జరిగిన ధారణ హత్య అందుకు కారణంగా పలువురు సంబంధిత అధికారులు ప్రశ్నిస్తున్నారు. సరైన నిఘా ఏర్పాటు లేకపోవడం ఆ ప్రాంతంలో సంబంధిత శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పలు ప్రమాదాలకు అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని వాదనలు తెరపైకొస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే చర్యలు చేపట్టి మత్తు పదార్థాలు వినియోగించేవారు, ఆ ప్రాంతంలో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వారిపై చర్ల చేపట్టాలని కోరుకుంటున్నారు.

Leave a Reply