ఆలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కృషి

ఆలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కృషి
- కాంగ్రెస్ నేతలు
ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యం తో పాటు ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని కాంగ్రెస్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, పీసీసీ సభ్యుడు చల్లూరి మధు, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య అన్నారు.
సోమవారం భూపాలపల్లిలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. మంజూరు నగర్ బూనీల వెంకటేశ్వర స్వామి ఆలయంపై బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని ఖండించారు. ప్రభుత్వ నిధులు, ప్రజల విరాళాలతో నిర్మించిన ఆలయాన్ని ఎండోమెంట్స్ శాఖ పరిధిలోకి తీసుకురావడం సమంజసమేనన్నారు.
ఆలయ నిర్మాణానికి డీఎంఎఫ్‌టీఈ నిధులతో పాటు 132 మంది దాతలు సహకరించారని, ఆ నిధుల వినియోగంపై పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఆలయ నిర్వహణలో పారదర్శకత కోసం కమిటీ నియామకం చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆలయాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని, వెంకటేశ్వర ఆలయానికి రూ.2 కోట్లు, హనుమాన్ ఆలయానికి రూ.1 కోటి నిధులు కేటాయించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఆలయాలను యాదాద్రి స్థాయిలో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు విస్లావత్ దేవన్, ఆలయ కమిటీ చైర్మన్ అన్నంనేని గోపాల్‌రావు తదితరులు పాల్గొన్నారు.
