రైతులకు జరుగుతున్న అన్యాయాలపై చర్యలు తీసుకోవాలి

రైతులకు జరుగుతున్న అన్యాయాలపై చర్యలు తీసుకోవాలి

  • మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

నల్గొండ, ఆంధ్రప్రభ : జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లలో రైతులకు జరుగుతున్న అన్యాయాలపై చర్యలు తీసుకోవాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య , జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, బిఆర్ఎస్ శ్రేణులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ధర్నా నిర్వహించి, ధాన్యం కొనుగోళ్లలో రైతులకు జరుగుతున్న అన్యాయాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గత నెల రోజులుగా జిల్లాలోని వివిధ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నాని తెలిపారు.

రైతులు తీవ్ర ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లలో అనేక సమస్యలు చోటుచేసుకుంటున్నాయన్నారు.ధాన్యం తరలించేందుకు సరిపడా లారీలు అందుబాటులో లేకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో వడ్లు రోజుల తరబడి పేరుకుపోతున్నాయని అన్నారు.రైతులు తీసుకొచ్చిన వడ్లలో అధికంగా తేమ, నాణ్యత పేరుతో అనవసర కోతలు విధిస్తున్నారని తెలిపారు.దళారులు రైతులను భయపెట్టి తక్కువ ధరలకు ధాన్యం కొనుగోలు చేసి అధికంగా డబ్బులు దండుకుంటున్నారని ఆరోపించారు.

కాంటాలు సకాలంలో జరగక రైతులు ఎండలో, వర్షంలో రోజులు తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.మార్కెట్ యార్డుల్లో కాంగ్రెస్ నాయకులు, వారి అనుచరులు పెత్తనం చెలాయిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కొనుగోలు కేంద్రాల్లో సరైన పర్యవేక్షణ లేక అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.తార్పాలిన్లు, తాగునీరు, నీడ వంటి కనీస సౌకర్యాలు కూడా కొనుగోలు కేంద్రాల్లో లేవు అన్నారు.కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు ఆలస్యం అవడంతో రైతులు అప్పుల పాలవుతున్నారని తెలిపారు.

కొందరు మధ్యవర్తులు అధికారులతో కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోతున్నా సరైన రక్షణ చర్యలు తీసుకోవడం లేదన్నారు.అన్ని కొనుగోలు కేంద్రాల్లో పారదర్శకంగా కాంటాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.సానుకూలంగా స్పందించిన జాయింట్ కలెక్టర్ 15 రోజుల్లోపు ధాన్యాన్ని పూర్తి స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.

Leave a Reply