అనుమానాస్పద మృతి కలకలం..

అనుమానాస్పద మృతి కలకలం..
- ఏజీఐ గ్లాస్ ఫ్యాక్టరీలో కార్మికుడు మృతి
ఆంధ్రప్రభ, ప్రతినిధి, యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఏజీఐ గ్లాస్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికుడు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. మండలంలోని హన్మాపురం గ్రామానికి చెందిన మేకల రాజు యాదవ్ అనే వ్యక్తి కంపెనీ లోపలే మృతిచెందిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.సమాచారం ప్రకారం, మృతుడి ముఖంపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఇది సాధారణ మరణం కాదనే అనుమానాలను మరింత బలపరుస్తోంది.సహోద్యోగులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, రాజు యాదవ్ ఆరోగ్యంగా విధులకు హాజరయ్యారని, అకస్మాత్తుగా ఇలా మృతి చెందడం అనుమానాస్పదంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పూర్తి స్థాయి విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని డిమాండ్ చేస్తున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం, పోలీసుల పాత్రపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.స్థానిక ప్రజలు, ప్రజా సంఘాలు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పూర్తి స్థాయి విచారణ జరిపి నిజాలు వెలుగులోకి తేవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రజలు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
