ఎక్కడికక్కడే ప్రజాసమస్యలకు సత్వర పరిష్కారం

ఎక్కడికక్కడే ప్రజాసమస్యలకు సత్వర పరిష్కారం
- మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు
- 47 మంది అర్జీలు సమర్పణ
రెడ్డిగూడెం, ఆంధ్రప్రభ : ప్రజల వద్దకు పాలనను చేర్చి, ఎక్కడికక్కడే సమస్యలను పరిష్కరించేలా ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. రెడ్డిగూడెంలోని మండల పరిషత్తు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రజాదర్బారులో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు పాల్గొన్నారు. నిర్విరామంగా వినతులను స్వీకరించారు. ప్రజల సమస్యలను ఓపికగా విని వారి సమస్యల పరిష్కారం కోసం ఆదేశించారు. 47 మంది అర్జీలు సమర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. అధికారులు ఎక్కడా నిర్లక్ష్యంగా ఉండకూడదన్నారు. ప్రజా సమస్యలకు నాణ్యమైన పరిష్కారాన్ని చూపించాలన్నారు. ఒకవేళ సమస్య పరిష్కారం కానీ పక్షంలో ఎందుకు పరిష్కారం కావడం లేదు దానికి సంబంధించిన విషయాలను కూడా ప్రజలకు తెలియజేయాలన్నారు.
ప్రభుత్వ అధికార యంత్రాంగం ఎక్కడికక్కడ బాధ్యతతో పని చేయాలన్నారు. సమస్యల మూలాలను గుర్తించి శాశ్వత పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజాదర్బారులో పోలీసు, రెవెన్యూ, పంచాయతీ రాజ్, విద్యుత్తు, రహదారుల అభివృద్ధి, వివిధ శాఖలకు సంభందించిన సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలపై ప్రజలు ఆర్జీలు సమర్పించారు.
అన్నేరావుపేటలో స్మశానవాటికకు రోడ్డు అభివృద్ధి చేయాలని, స్కూల్ భవనాలు నిర్మించాలని, రుద్రవరం – కుదప రోడ్డు మార్గంలో రెండు కల్వర్టులు నిర్మించాలని, గతంలో ఇళ్లస్థలాలు 1.5 సెంట్లు ఇచ్చారని, దాన్ని 3 సెంట్లుగా మార్చి ఇవ్వాలని, జెడ్పి హైస్కూల్ ప్రహరీ గోడ నిర్మించాలని, స్మశానవాటికలను అభివృద్ధి చేయాలని, ఎన్.ఎస్.పి కాల్వ గట్లుపై చెట్లను నరికిన వైనంపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లో జరిగిన పొరబాటు సరిదిద్దాలని, చిరుద్యోగం ఇప్పించాలని, హౌసింగ్ పథకం కింద ఇళ్ళు మంజూరు చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని రవాణా చేయాలని, కాటాలో వ్యత్యాసం లేకుండా చూడాలని కోరగా అధికారులతో మాట్లాడి వెంటనే సమస్యలను పరిష్కారించారు. అధికారులు, ఎన్డీఏ కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.
