28 నుండి పెన్నాహోబిలేసుని బ్రహ్మోత్సవాలు..

28 నుండి పెన్నాహోబిలేసుని బ్రహ్మోత్సవాలు..
6న స్వామివారి బ్రహ్మరథోత్సవం
భారీ ఏర్పాట్లు
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నహోబిలంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈనెల 28వ తేదీ నుండి మే 9వ తేదీ వరకు జరుగునున్నాయి. ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో సాకే రమేష్ బాబు, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రాయంపల్లి రేగాటి నాగరాజులు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 28వ తేదీన మండలంలోని ఆమిద్యాల గ్రామంలోని పెన్నాఓబులేసు ఆలయం నుంచి భూదేవి, శ్రీదేవి సమేతుడైన నరసింహ స్వామి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుతో, పెన్నాహోబిలం లోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేరుతాయని వారు తెలిపారు. 29వ తేదీన ఉదయం ప్రత్యేక పూజలు, ధ్వజారోహణం, బలిహరణ, మహా మంగళహారతి కార్యక్రమాలు, సాయంత్రం ప్రాకారోత్సవం ఉంటాయన్నారు.
30వ తేదీన ఉదయం సింహ వాహనోత్సవం, రాత్రి చంద్రప్రభ వాహనోత్సవం, మే 1వ తేదీన గోవానోత్సవం, రాత్రి శేషవాహనోత్సవం కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2వ తేదీన సాయంత్రం హంసవాహ నోత్సవం, 3వ తేదీన సాయంత్రం హనుమంత వాహనోత్సవం, 4వ తేదీన రాత్రి గరుడవాహనోత్సవం, అదే రోజు రాత్రి కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 5వ తేదీన సూర్యప్రభ వాహనోత్సవం, సాయంత్రం ఐరావతవాహనోత్సవం,6వ తేదీన తెల్లవారుజామున ప్రత్యేక పూజ కార్యక్రమాలు, ఉదయం 10 గంటలకు మడుగుతేరు, సాయంత్రం 5 గంటలకు బ్రహ్మరథోత్సవం, 7వ తేదీన సాయంత్రం అశ్వవాహనోత్సవం, 8వ తేదీన సాయంత్రం ధ్వజారో హణము రాత్రి శయనోత్సవం, 9వ తేదీన స్వామివారి ఉత్సవ విగ్రహాలు ఆమిద్యాల గ్రామంలోని పెన్నోబిలేసుని ఆలయానికి చేరుతాయని తెలిపారు.

బ్రహ్మోత్సవాలు సందర్భంగా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, ఆలయ ఆవరణంలో చలవ పందిర్లు, తాగునీటి సౌకర్యం, విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశామన్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో తరలిరానన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా ఉరవకొండ సీఐ మహానంది, ఎస్సై జనార్దన్ నాయుడులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
ఆలయ చరిత్ర :
రాయలసీమలోని నరసింహ క్షేత్రాలలో పెన్నాహోబిలం ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతం పుణ్యక్షేత్రంగానే కాక పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందింది. అనంతపురం – ఉరవకొండ జాతీయ రహదారి ప్రక్కన పెన్నా నదికి 3 కిలోమీటర్ల దూరంలో ఒక గిరిపై పెన్నాహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వెలిసింది. ఈ గిరికి తూర్పు వైపున గొల్లపల్లి అనే గ్రామం ఉండేది. గ్రామంలోని ఒక గోవుపత్రి దినం కొండపైకి చేరి బిలం వద్ద పాలు ఇచ్చేదని చరిత్ర చెబుతోంది. గోవు యజమాని గోవు పొదుగులో పాలు లేకపోవడం గమనించి కలత చెందగా శ్రీ లక్ష్మి నరసింహస్వామి అతని కలలో కనిపించి గోక్షీరం తానే సేవిస్తున్నాని తెలిపారు.

సంతోష భరతుడై గోవు యజమాని గిరిపై గాలించగా బిలం పైన 5 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు ఉన్న శ్రీవారి పాదముద్రికల శిలాఫలకం కింద వైపు నైరుతి దిశలో లక్ష్మీదేవి అమ్మవారి శిలాఫలకం లభించింది. గొల్లపల్లి వాసులు శ్రీవారికి, లక్ష్మీదేవి అమ్మవారికి చిన్న ఆలయాన్ని నిర్మించి పూజలు ప్రారంభించారని స్థలపురాణం. స్థానికంగా లభించిన ఆధారాలు ఆలయ నిర్మాణం, శైలి, శాసనాలు ఆధారంగా వాటిని విజయనగర సామ్రాజ్య సామ్రాజ్యధీశులు ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. విజయనగర సామ్రాజ్య ధీశులైన సదాశివారాయలు విజయనగరం నుంచి పెనుగొండకు వెళుతూ ఈ ప్రాంతంలో మజిలీలు చేసినట్లు చెబుతున్నారు. శ్రీ స్వామి వారు సదాశివ రాయలకు కలలోకనిపించి నీ జైత్రయాత్ర దిగ్విజయం అవుతుందని ఆశీర్వదించారు.
జైత్రయాత్ర ముగించుకున్న సదాశివారాయలు తిరిగి ప్రయాణంలో స్వామివారిని దర్శించుకుని, స్వామివారి అమ్మవారికి ఆలయాలు నిర్మించమని ఉదిరిపి ప్రాంత ప్రతినిధులను ఆదేశించగా ఆలయాలు నిర్మించినట్లు తెలుస్తోంది. ఆలయ నిర్మాణం తో పాటు ఏక శిలాఫలకం మలచిన ధ్వజస్తంభం రాజు గారి జైత్రయాత్రకు చిహ్నం. ఏకశిల విజయ స్తంభం ప్రతిష్టించినట్లు తెలుస్తోంది. ప్రజలు కోరిక మేరకు రాజు ఆ ప్రాంతంలో భూములకు శిస్తు రద్దు చేసినట్లు ఆలయ నిర్వహణకు ఓ గ్రామాన్ని దానం చేసినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. గిరిపై ఉన్న ఆ ప్రాంతంలోని బిళo లో పాదముద్రికలు లభ్యం కావడం బిళoలో, పోసిన నీరు సమీపంలోని పెన్నాహో బిళలం నదిలో కలవడం వలన ఈ ప్రాంతాని కి పెన్నాహోబిలంగా పేరు వచ్చింది. ఆలయం ఎడమ వైపు ఉన్న గోపురం వద్ద తెలుగు, కన్నడ భాషలు కలిసిన హుళ్ళిగన్నడ ( పాత కన్నడ ) లిపితో శిలా శాసనం ఇప్పటికీ ఉంది.

