స్మార్ట్ రోబోల కొత్త యుగం

స్మార్ట్ రోబోల కొత్త యుగం
బీజింగ్ : అంట్లు తోమడం, బట్టలు ఉతకడం, గదులను శుభ్రం చేయడం వంటి పనిమనుషులు చేసే పనులను చేయడానికి కొత్తగా మార్కెట్లోకి హ్యూమనాయిడ్ రోబోలు రాబోతున్నాయి. ఇప్పటికే చైనా హ్యూమనాయిడ్ రోబోట్లు వంటగదిలో పనులను చేయగల సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. పరుగులు తీయడం, నృత్యాలు చేయడం వంటి పనులను చేస్తున్న ఈ మనుషులను పోలిన రోబోలు ఇప్పుడు గిన్నెలు కడగడానికీ సిద్ధమవుతున్నాయి.
గోల్డ్మన్ సాక్స్ అంచనాల ప్రకారం, 2035 నాటికి హ్యూమనాయిడ్ రోబోట్ల ప్రపంచ మార్కెట్ విలువ 38 బిలియన్ డాలర్లకు చేరవచ్చని భావిస్తున్నారు. ఈ రంగంలో చైనా, అమెరికా సంస్థలు ముందంజలో ఉన్నాయి. రోజువారీ గృహ పనులను భవిష్యత్తులో రోబోట్లతో ఎలా చేయించవచ్చో చూపిస్తూ బీజింగ్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో హ్యూమనాయిడ్ యంత్రాలు నెమ్మదిగా చెత్తను ఏరడం, పూలను వేరు చేయడం వంటి పనులను చేసి చూపించాయి. చైనాలోని షెన్జెన్ నగరానికి చెందిన ‘ఎక్స్ స్క్వేర్ రోబో’ అనే స్టార్టప్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
కొత్తగా రూపొందించిన ఈ రోబో చాలా సున్నితమైన సూచనలను కూడా ఖచ్చితంగా పాటిస్తుందని సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి వాంగ్ కియాన్ తెలిపారు. హార్డ్‌వేర్ పరంగా ఎక్కువ భాగం సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు అభివృద్ధి చెందిన హ్యూమనాయిడ్ రోబోలు అగ్రశ్రేణి అథ్లెట్ల కంటే వేగంగా హాఫ్ మారథాన్‌లను పూర్తి చేయగలిగినా, సగటు మనిషికి సులభంగా అనిపించే పనులు మాత్రం వాటికి ఇంకా సవాలుగానే ఉన్నాయి. చిందరవందరగా ఉన్న గదిని సర్దడం, పాత్రలను డిష్‌వాషర్‌లో పెట్టడం, బట్టలు మడతపెట్టడం వంటి పనుల్లో ఇంకా మెరుగుదల అవసరమని నిపుణులు చెబుతున్నారు.
ఈ సమస్యకు గల కారణాన్ని వివరించిన వాంగ్ కియాన్, మారథాన్ రోబోలు ప్రధానంగా స్థిరమైన పరిస్థితుల్లో పనిచేయగలవని, కానీ మనుషులు చేసే సూక్ష్మ కదలికల్లో 0.1 మిల్లీమీటర్ తేడా వచ్చినా పనితీరు దెబ్బతింటుందని తెలిపారు. దీనికి పరిష్కారంగా, 100కి పైగా గృహాల నుంచి సేకరించిన డేటాతో శిక్షణ పొందిన ‘వాల్-బి’ అనే ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేశామని చెప్పారు. ఈ మోడల్‌ను వచ్చే నెలాఖరులో గృహ శుభ్రపరిచే రోబోలలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.
