మరణానంతరం మహాదానం…

మరణానంతరం మహాదానం…

ఐదుగురికి ప్రాణం పోసిన యువ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి
కూకట్‌పల్లి మెట్రో వద్ద ప్రమాదం
బ్రెయిన్ డెడ్ తర్వాత అవయవదానం
కుటుంబ సభ్యుల మానవతా దృక్పథం

జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ: ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేటకు చెందిన యువ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఉప్పుతోళ్ల విజయ్ కుమార్ మరణానంతరం ఐదుగురికి ప్రాణదానం చేసి మానవత్వానికి నిదర్శనంగా నిలిచారు. ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన అనంతరం కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు రావడం విశేషం. రెండు రోజుల క్రితం హైదరాబాదులోని కూకట్‌పల్లి మెట్రో పిల్లర్ నంబర్ 822 వద్ద జరిగిన బైక్ ప్రమాదంలో విజయ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించడంతో… కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకుని అవయవదానానికి ముందుకు వచ్చారు.

వైద్యుల పర్యవేక్షణలో హృదయం, కాలేయం, కిడ్నీలు, ఇతర అవయవాలను అవసరమైన వారికి మార్పిడి చేయడం ద్వారా ఐదుగురికి కొత్త జీవితం లభించింది. అతి చిన్న వయస్సులోనే సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగం సంపాదించి… సహచరుల మధ్య మంచి పేరు తెచ్చుకున్న విజయ్ కుమార్ ఆకస్మిక మృతి జగ్గయ్యపేటలో విషాదాన్ని మిగిల్చింది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతదేహాన్ని నేడు జగ్గయ్యపేటకు తరలించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామంలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. జీవితాన్ని కోల్పోయినప్పటికీ… మరణానంతరం ఐదుగురికి ప్రాణం ఇచ్చిన విజయ్ కుమార్ సేవాస్ఫూర్తి సమాజానికి ఆదర్శంగా నిలుస్తోందని పలువురు కొనియాడారు.

Leave a Reply