పసిపిల్లలే టార్గెట్.. మాయమాటలతో బురిడీ కొట్టించి!

పసిపిల్లలే టార్గెట్.. మాయమాటలతో బురిడీ కొట్టించి!

ముగ్గురు నిందితుల అరెస్ట్
కిడ్నాపర్ల నుంచి మరో బాలుడిని రక్షించిన పోలీసులు
రూ. 80,500 నగదు సీజ్

మచిలీపట్నం, ఆంధ్రప్రభ: అభం శుభం తెలియని పసిపిల్లలను ఎరగా చేసుకుని వారి ద్వారా డబ్బు సంపాదించాలని, సులభ సంపాదన మోజులో పడి తల్లి పొత్తిళ్ళలో నుండి బిడ్డలను వేరుచేసి విక్రయిస్తున్న ముఠా గుట్టును కృష్ణా జిల్లా పోలీసులు రట్టు చేశారు.

జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 17న పెనమలూరు పోలీస్ స్టేషన్లో నమోదు కాబడిన కిడ్నాప్ కేసులో కిడ్నాపర్ల చెర నుండి 10 నెలల బాలుడిని రెస్క్యూ చేసి కొనుగోలు చేసిన ఇద్దరినీ, ఆటో డ్రైవర్ను అదుపులోనికి తీసుకున్నట్టు తెలిపారు. వారిని పూర్తిస్థాయిలో విచారణ జరిపి ఈ కేసులు ప్రధాన నిందితులైన మరో ముగ్గురిని అదుపులోనికి తీసుకోవడం జరిగిందని వెల్లడించారు

గంటా మేరీ(26), పెడమర్తి కనకమ్మ (23), గండికోట గురమ్మ(30)ను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరు భిక్షాటన చేసుకునే మహిళల్ని లక్ష్యంగా చేసుకొని వారి వద్ద ఉన్న పిల్లలను మాయమాటలతో బురిడీ కొట్టించి కిడ్నాప్ చేసి ఇతరులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు విచారణలో తెలిందని పేర్కొన్నారు.

ఈ నెల 18న పది నెలల బాలుడు కాకుండా గతంలో విజయవాడలోని ఒక గుడి సమీపంలో శివం అనే 16 నెలల బాబును కిడ్నాప్ చేసినట్లు ఆ బాలుని విక్రయించే ప్రక్రియలో కొనుగోలుదారులు వద్దని చెప్పడంతో తమ సమీప బంధువుల ఇంటి వద్ద ఆ బాలుడిని ఉంచినట్లు తెలపడంతో ఆ బాలుని సురక్షితంగా రెస్క్యూ చేశారు. ఇదేగాక గతంలో కూడా మరిన్ని కిడ్నాప్లలో పాల్గొన్నట్లు విచారణలో తెలపడం జరిగిందన్నారు.

ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతూ ఉందని మరిన్ని విషయాలు రాబట్టి కిడ్నాప్ గురైన పిల్లలను వారి తల్లిదండ్రులు చెంతకు చేర్చడమే లక్ష్యంగా కృష్ణాజిల్లా పోలీస్ శాఖ కృషి చేస్తుందని ఎస్పీ తెలిపారు. కిడ్నాపర్ల చెర నుండి రిస్క్యూ చేసిన బాలుడు యొక్క తల్లిదండ్రుల వివరాలు తెలియాల్సి ఉందని, వాటిని త్వరగతిన గుర్తించి వారి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చేందుకు ముమ్మరంగా చర్యలు చేపడుతున్నామన్నారు. ముద్దాయిల వద్ద నుండి 80,500 రూపాయలు నగదు సీజ్ చేయడం జరిగిందని వెల్లడించారు.

ఎస్పీ మాట్లాడుతూ.. కొత్త వ్యక్తులు ఎవరైనా ఎదురుపడితే మీ పిల్లలను ఎట్టి పరిస్థితులలో వారికి అప్పగించవద్దని, అనుమానాస్పదంగా ఎవరైనా మీ చుట్టుపక్కల తారసపడితే పోలీసులకు తెలియజేయాలని తెలిపారు.

Leave a Reply