ఐకేపీ యానిమేటర్లకు సెల్ ఫోన్లు పంపిణీ..

ఐకేపీ యానిమేటర్లకు సెల్ ఫోన్లు పంపిణీ..
ఎమ్మెల్యే సునీత
రాప్తాడు, ఆంధ్రప్రభ : స్వయం సహాయక సంఘాల సభ్యులకు అందించే సేవల్లో వేగం పెంచడం కచ్చితమైన సమాచారం పారదర్శకత కోసమే యానిమేటర్లకు స్మార్ట్ ఫోన్లు అందజేస్తున్నామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. మంగళవారం రాప్తాడు మండల కేంద్రంలోని పంగల్ రోడ్డు దగ్గర ఉన్న టీటీడీసీలో నియోజకవర్గ యానిమేటర్లతో సమావేశం నిర్వహించారు. రాప్తాడు నియోజకవర్గంలోని ఆత్మకూరు అనంతపురం రూరల్ రాప్తాడు మండలాల యానిమేటర్లకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఐసిడిఎస్ జిల్లా పిడి టీ. శైలజ చేతుల మీదుగా ప్రభుత్వం మంజూరు చేసిన సెల్ ఫోన్లను పంపిణీ చేశారు.
ఈ సంధర్భంగా ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో పరిపాలన ఇతర కార్యక్రమాలను ఆధునీకరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఇందులో భాగంగా స్వయం సహాయక బృందాల కార్యకలాపాల సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం యానిమేటర్లకు 120 మందికి ఉచిత మొబైల్ ఫోన్లు పంపిణీ చేసిందన్నారు.

దీని ద్వారా రికార్డులన్నీ సెల్ ఫోన్ లో ఉండేలా చేసుకోవచ్చన్నారు. యానిమేటర్లు ఈ సెల్ ఫోన్ల ద్వారా రుణాలు గ్రూపు నిర్వహణ, పుస్తకాల నిర్వహణకు సంబంధించిన సమాచారాన్ని రికార్డ్ చేసి నేరుగా రాష్ట్ర సర్వర్‌లకు అప్‌లోడ్ చేయడానికి వీలు ఉంటుందన్నారు. ఏ సభ్యురాలు ఎంత డబ్బు చెల్లిస్తున్నారు అది బ్యాంక్ వరకు చేరుతోందా లేదా ఇంకా ఎంత చెల్లించాలి వంటి సమగ్ర వివరాలు సెల్ ఫోన్ లో నిక్షిప్తమవుతాయన్నారు.
ఇది వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు పారదర్శకత నమ్మకాన్ని పెంచుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపిఎంలు రాప్తాడు టి.సునీత ఆత్మకూరు పద్మావతి అనంతపురం రూరల్ రవికుమార్ నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ టి.సుభద్రమ్మ రాప్తాడు మండల సమైక్య అధ్యక్షురాలు సుశీలమ్మ ఆత్మకూరు లక్ష్మీదేవి అనంతపురం చంద్రకళ ఎఫ్ పిఓలు ధనలక్ష్మి చంద్రకళ యానిమేటర్లు పాల్గొన్నారు.
