సురక్ష పీపుల్స్ హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం

సురక్ష పీపుల్స్ హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రోగికి అండగా నిలిచిన డాక్టర్ చైతన్య
నాలుగు గంటల పాటు క్లిష్ట ఆపరేషన్ – వైద్య బృందం ప్రతిభకు ప్రశంసలు
అచ్చంపేట ఏప్రిల్ 17, (ఆంధ్రప్రభ) నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేట పట్టణంలోని సురక్ష పీపుల్స్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ చైతన్య మరోసారి తమ నైపుణ్యాన్ని నిరూపించారు. ప్రాణాపాయ పరిస్థితుల్లో ఆస్పత్రిలో చేరిన ఓ మహిళకు అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ఆమెకు పునర్జన్మను ప్రసాదించారు. పులిజాల గ్రామానికి చెందిన పంగ యాదమ్మ (55) గత మూడు రోజులుగా తీవ్రమైన కడుపు నొప్పి, రక్తస్రావంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరింది. ఆమెను పరిశీలించిన డాక్టర్ చైతన్య పలు పరీక్షలు నిర్వహించగా గర్భాశయంలో క్యాన్సర్ గడ్డ ఏర్పడి, అది చుట్టుపక్కల గ్రంథులకు కూడా వ్యాపించినట్లు గుర్తించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సాధారణంగా హైదరాబాద్ వంటి పెద్ద నగరాల్లోనే శస్త్రచికిత్స చేయించుకోవాలని సూచిస్తారని వైద్యులు తెలిపారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా రోగి కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లలేమని చెప్పడంతో, స్థానికంగానే చికిత్స చేయాలని డాక్టర్ చైతన్య ముందుకు వచ్చారు.

హైదరాబాద్ నిపుణుల సహకారంతో ఆపరేషన్
ఈ నేపథ్యంలో హైదరాబాద్కు చెందిన సర్జికల్ ఆంకాలజిస్టులు డాక్టర్ అశ్విన్ పండిట్, డాక్టర్ శృతి, అనస్తీషియా నిపుణుడు డాక్టర్ వెంకట్ రెడ్డి సహకారంతో గురువారం సాయంత్రం 6:45 గంటల నుంచి రాత్రి 10:45 గంటల వరకు సుమారు నాలుగు గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించారు. డాక్టర్ మైతన్య ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్లో గర్భాశయంతో పాటు దాని చుట్టూ ఉన్న క్యాన్సర్ గడ్డలను పూర్తిగా తొలగించారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యం మెరుగుపడుతూ కోలుకుంటోంది.
వైద్యుల సేవలకు అభినందనలు
ఇంత క్లిష్టమైన శస్త్రచికిత్సను స్థానికంగా విజయవంతంగా నిర్వహించడం పట్ల ప్రజలు, రోగి కుటుంబ సభ్యులు వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆపరేషన్లో బాలాజీ, బాలరాజు, రాజు, జ్ఞానేశ్వరి, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

