కృత్యాలతో చిదివితే చిన్నారులు మర్చిపోలేరు

కృత్యాలతో చిదివితే చిన్నారులు మర్చిపోలేరు
- అంగన్వాడీ వేడుకల్లో సీడీపీఓ జయరాం నాయక్
- 20 మంది చిన్నారులకు సర్టిఫికెట్లు అందజేత
సంగారెడ్డి ప్రతినిధి, ఏప్రిల్ 17 (ఆంధ్రప్రభ): గతేడాది నుంచి నేర్చుకున్న వివిధ కృత్యాలను ప్రదర్శిస్తూ అంగన్వాడీ చిన్నారులు అందరినీ ఆకట్టుకున్నారు. పిల్లలతో ఆటలు, పాటలు, కథలు, పూర్వ గణిత భావనలు, పూర్వ అక్షరాస్యతకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించారు. గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రం పరిధిలోని ఐదు అంగన్వాడీ కేంద్రాల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం స్కూల్ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు తమ ప్రతిభను చక్కగా ప్రదర్శించగా, హాజరైన తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పిల్లలకు సర్టిఫికెట్లు అందజేయడంతో పాటు, వారి అభివృద్ధి స్థాయిని సూచించే అసెస్మెంట్ కార్డులను కూడా ప్రదానం చేశారు. ప్రైమరీ స్కూల్కు వెళ్లనున్న 20 మంది చిన్నారులకు ప్రత్యేకంగా సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీడీపీఓ జయరాం నాయక్ హాజరయ్యారు. అలాగే మున్సిపల్ ఛైర్పర్సన్ కుమార్ గౌడ్, వైస్ ఛైర్పర్సన్ సంధ్య గోవర్ధన్ రెడ్డి, కౌన్సిలర్లు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్పర్సన్ మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాలు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా పని చేస్తున్నాయని ప్రశంసించారు. చిన్నారుల సమగ్ర అభివృద్ధికి అంగన్వాడీల పాత్ర ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుమ్మడిదల అంగన్వాడీ సూపర్వైజర్ కవిత, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
