MP | బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి యత్నం!

MP | బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి యత్నం!

MP | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : లోక్‌సభలో డీలిమిటేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చిచ్చురేపాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ నిరసనల్లో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయ ముట్టడికి బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించడంతో నాంపల్లి పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

పార్లమెంట్‌లో అసలేం జరిగింది?

నిన్న లోక్‌సభలో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన తేజస్వీ సూర్య.. గత యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను అత్యంత దారుణంగా విభజించిందని ఆరోపించారు. బ్రిటీష్ వారు చేసిన భారత్-పాక్ విభజన కంటే దారుణంగా ఏపీ విభజన జరిగిందని, కాంగ్రెస్ పార్టీ వారసత్వమే అటువంటిదని ఆయన విమర్శించారు.

తేజస్వీ సూర్య వ్యాఖ్యలు తెలంగాణ అస్తిత్వాన్ని, ఆకాంక్షలను అవమానించేలా ఉన్నాయని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం వైపు దూసుకెళ్లారు.

ముందస్తు సమాచారం అందుకున్న పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులను రోడ్డుపైనే అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, నిరసనకారులకు మధ్య వాగ్వాదం జరిగి తోపులాట చోటుచేసుకుంది.

ఈ నిరసనల కారణంగా నాంపల్లి ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

తెలంగాణ పట్ల అనుచితంగా మాట్లాడిన తేజస్వీ సూర్యపై బీజేపీ అధిష్టానం కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.

ప్రస్తుతం బీజేపీ కార్యాలయం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఎంపీ వ్యాఖ్యలు ఇప్పుడు రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి.

Leave a Reply