16aprchintana | జీవితంలో సుఖదుఃఖాల చక్రం

16aprchintana | జీవితంలో సుఖదుఃఖాల చక్రం

16aprchintana | సుఖదుఃఖాల సహజ స్వభావం
ఆశావహ దృక్పథం మరియు స్థైర్యం అవసరం
తేనెటీగ కథలోని జీవన పాఠం
మానవ ప్రయత్నం ప్రాముఖ్యత
వివేకానంద సందేశం – కార్యోన్ముఖత వైపు

16aprchintana | సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యా నంతరం సుఖం
చక్రవత్ పరివ ర్తంతే దుఃఖానిచ సుఖానిచ”.

సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం రెండూ ఒక దాని తర్వాత ఒకటి చక్రభ్రమణంలా జీవితంలో వస్తూ, పోతుంటాయి. ఇది సృష్టి ధర్మం. లోక సహజమైన ఈ సుఖదుఃఖాలకు పొంగి పోవడం, క్రుంగి పోవడం కూడదు. సుఖం కలిగినప్పుడు ఆ తర్వాత ఎంతటి దుఃఖం కలిగినా ఎదుర్కొనే మన స్థైర్యం, అలాగే దుఃఖం కల్గినప్పుడు రాబోయే సంతోషకరమైన రోజులు కోసం ఎదురు చూసే సహనంను సాధనతో అలవరచుకోవాలి.

సముద్రంలోని ఆటు-పోట్ల వలె నిరంతరం మనల్ని కుదుపుతున్న పరిస్థితులకు భయపడి, అనవసరమైన అర్థంతర నిర్ణయాలు తీసుకోవడం బుద్ధిమంతుల లక్షణం కాదు. ఆశావహ దృక్పథంతో, సానుకూలతా ధోరణితో ముందుకు సాగిపోవాలే కానీ, నిరాశతో ఆగిపోరాదు. అంతే కాదు. ఆపదలు తప్పించుకోడానికి మన వంతు ప్రయత్నం కూడా చేయాలి.

ఈ సందర్భంలో అప్పయ్య దీక్షితులు రచించిన “కువలయానందం” అనే గ్రంథంలోని ఈ శ్లోకం ఎంత గొప్ప సందేశం ఇస్తోందో చూడండి:

“రాత్రిర్గమిష్యతి భవిష్యతి సుప్రభాతం
భాస్వాన్ ఉదేశ్యతి హసి ప్యతి పంకజశ్రీః
ఇత్థం విచింత యతి కోశగతే ద్విరేఫే
హాహంత హంత నలి నీం గజ ఉజ్జహార”

ఒక తేనెటీగ సాయం వేళ కమలంలోని మకరందాన్ని ఆస్వాదించడానికి అందులోకి చొరబడింది. ఆ పువ్వులోని తియ్యని మకరందంను అది ఆరగిస్తుండగానే సూర్యాస్తమయం కావడం, ఆ కమలం ముకుళించుకుపోవడం, అందులో తేనెటీగ చిక్కుకుపోవడం జరిగి పోయాయి.

అప్పుడది అనుకొన్నదట… “ఈ రాత్రి గడిచి పోతుంది. తెల్లవారుతుంది. కమలం తిరిగి వికసిస్తుంది. నేను స్వేచ్ఛగా బయట పడగలను” అని. ఇది నిజంగా ఒక ఆశావహ ఆలోచన.

కానీ, విధి బలీయమైనది కదా! ఇంకా తెలతెలవారుతుండగానే ఒక ఏనుగు ఆ కమలాన్ని తన తొండంతో పెరికివేసి నేలకేసి కొట్టింది. పాపం తేనెటీగకు కాలగతి తప్పలేదు.

మంచి సమయం కోసం ఎదురు చూస్తూ, నిష్క్రియాపరత్వంతో ఉండకుండా, ఆ కమలాన్ని ఛేదించుకొని బయట పడే ప్రయత్నం చేసి ఉంటే అది తన మరణంను తప్పించుకుని ఉండేది. కాలంపైనా, దైవం మీద పూర్తిగా ఆధారపడి, మానవ ప్రయత్నం చేయకపోతే అది మూఢభక్తి మాత్రమే అవుతుంది.

అందుకే స్వామి వివేకానంద “ఉత్తిష్టత జాగ్రత” అనే వాక్యంతో మనకు జాగృతి, చైతన్యం, కార్యోన్ముఖత అవసరమని చెప్పారు. మరి సమయం వృథా చేయకుండా విద్యార్థులు, యువకులు, పెద్దలు కూడా కార్యోన్ముఖులమవుదాం.

-డాక్టర్ గొల్లాపిన్ని సీతారాము శాస్త్రి

Leave a Reply