Ponnam | చర్చలకు తలుపులు తెరిచే ఉన్నాం

Ponnam | చర్చలకు తలుపులు తెరిచే ఉన్నాం

Ponnam | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆర్టీసీ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో సమ్మెకు వెళ్లడం సరైన నిర్ణయం కాదని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. కార్మికుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

తెలంగాణలో ఆర్టీసీ సమ్మెపై ఉద్రిక్తత నెలకొన్న వేళ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమ్మెకు వెళ్లడం సరైంది కాదని, సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఆయన పేర్కొన్నారు.

కార్మికుల సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ బకాయిలైన పీఎఫ్ రూ.600 కోట్లు, సీసీఎస్ రూ.300 కోట్లను గణనీయంగా తగ్గించామని తెలిపారు. అలాగే 2,978 కొత్త బస్సులను ప్రవేశపెట్టామని, 1,134 కారుణ్య నియామకాలు పూర్తి చేశామని వెల్లడించారు.

కొత్త ఉద్యోగాల భర్తీ తుది దశలో ఉందని, ఇటీవల 2.1 శాతం డీఏ అమలు చేశామని, పీఆర్సీ పరిశీలనలో ఉందని మంత్రి పేర్కొన్నారు. ఉచిత బస్సు ప్రయాణం కారణంగా 90కి పైగా డిపోలు లాభాల్లో ఉన్నాయని తెలిపారు. ఆర్టీసీ విలీనంపై ఉన్నత స్థాయి కమిటీ అధ్యయనం చేస్తోందని చెప్పారు.

విలీనం, యూనియన్ల గుర్తింపు మినహా మిగిలిన అన్ని అంశాలపై చర్చలకు సిద్ధంగా ఉన్నామని, తన తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని హామీ ఇచ్చారు. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని సమ్మె ఆలోచన విరమించుకోవాలని కార్మికులను మంత్రి కోరారు.

ఇదిలా ఉండగా, తమ డిమాండ్లు నెరవేరని పక్షంలో ఏప్రిల్ 22 నుంచి సమ్మెలోకి వెళ్తామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ఏప్రిల్ 21 అర్థరాత్రి నుంచి బస్సులు నిలిపివేసి, 22 తెల్లవారుజాము నుంచి సమ్మె ప్రారంభిస్తామని వెల్లడించింది.

Leave a Reply