ఆధ్యాత్మిక పర్యటనలో ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ఆకాంక్షించారు.

గత రెండు రోజులుగా ఆయన ఆధ్యాత్మిక పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా దక్షిణ భారతదేశంలోని పలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

పర్యటన విశేషాలు:

మొదటగా జోగులాంబ గద్వాల జిల్లాలోని శక్తి పీఠం అలంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారి బృందావనాన్ని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు.

తదుపరి సోమశిలలో కృష్ణా నది తీరాన ఉన్న రెండు శివాలయాలను సందర్శించి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం శ్రీశైలం చేరుకుని భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుని రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే శ్రీశైలం ఉత్తర ద్వారం అయిన ఉమామహేశ్వర ఆలయాన్ని కూడా దర్శించారు.

విద్యుత్ కేంద్రం సందర్శన:

ఆధ్యాత్మిక పర్యటన అనంతరం శ్రీశైలం డ్యామ్ అండర్ టన్నెల్‌లో ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి పనితీరు, విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలందరి భాగస్వామ్యం అవసరమని, భగవంతుని కృపతో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని కోరుకున్నట్లు తెలిపారు.

Leave a Reply