traffic | ఇబ్బందులు తప్పవ్..

traffic | ఇబ్బందులు తప్పవ్..

వాహనదారులకు ఎల‌ర్ట్‌
చలాన్లు చెల్లించకపోతే డ్రైవింగ్‌ లైసెన్స్, ఆర్సీ ఫ్రీజ్‌
త్వరలోనే అమలు కానున్న కొత్త రూల్స్

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : తెలంగాణలోని వాహనదారులు అప్ర‌మ‌త్తంగా ఉండకుంటే ఇక‌పై క‌ష్టాలు త‌ప్ప‌వు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధ‌మైంది. ఏడాదికి ఐదు కంటే ఎక్కువ చలాన్లు ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఆర్సీ ఫ్రీజ్ చేయాలని నిర్ణయించింది. పదేపదే నిబంధనలు అతిక్రమించినా, జరిమానాలు కట్టకపోయినా వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ), డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్) స్తంభింపజేసే (ఫ్రీజ్) కఠిన నిబంధనలను అమలు చేసేందుకు రవాణా శాఖ సిద్ధమవుతోంది. పెండింగ్ చలాన్ల వసూలు, వాటిపై వచ్చే వివాదాల పరిష్కారం కోసం ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది.

చలాన్ల జారీ నుంచి పరిష్కారం వరకు ప్రభుత్వం స్పష్టమైన కాలపరిమితులను నిర్దేశించింది. కెమెరా ఆధారిత చలాన్‌ను 3 రోజుల్లో, మాన్యువల్ చలాన్‌ను 15 రోజుల్లోగా పంపాలి. చలాన్ అందిన 45 రోజుల్లో వాహనదారుడు జరిమానా కట్టాలి లేదా ఆన్‌లైన్‌లో అభ్యంతరం తెలపాలి. ఫిర్యాదు అందిన 30 రోజుల్లోగా అధికారులు తమ నిర్ణయం వెల్లడించాలి. అధికారుల నిర్ణయంపై అసంతృప్తిగా ఉంటే, చలాన్ మొత్తంలో 50 శాతం చెల్లించి కోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించారు.

ఒక వాహనంపై ఏడాదిలో 5 కంటే ఎక్కువ చలాన్లు పెండింగ్‌లో ఉంటే, ఆ సమాచారం నేరుగా రవాణా శాఖకు వెళ్తుంది. వెంటనే సంబంధిత వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ లేదా వాహన ఆర్సీని అధికారులు బ్లాక్ చేస్తారు. ఇలా బ్లాక్ అయిన తర్వాత ఆ వాహనానికి సంబంధించిన ఫిట్‌నెస్, యాజమాన్య బదిలీ వంటి ఏ ఆర్టీఏ సేవలు పొందడం సాధ్యం కాదు. పెండింగ్‌లో ఉన్న చలాన్లన్నీ పూర్తిగా చెల్లించిన తర్వాతే ఈ సేవలను తిరిగి పునరుద్ధరిస్తారు. ఈ కఠిన నిబంధనల ద్వారా వాహనదారుల్లో బాధ్యతను పెంచడంతో పాటు, రాష్ట్రంలో రహదారి భద్రతను మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Leave a Reply