పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలి

పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలి

  • జంగేడు పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ రాహుల్ శర్మ

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : పదో తరగతి వార్షిక పరీక్షలు ఎటువంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. శనివారం జంగేడు ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించిన కలెక్టర్ పరీక్షా హాళ్లను సందర్శించి విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి తీసుకున్న ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

తాగునీరు, విద్యుత్, పరిశుభ్రత, భద్రత వంటి మౌలిక సదుపాయాలు సమృద్ధిగా ఉండేలా చూడాలని సూచించారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత పాటించాలని, విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ తనిఖీలో విద్యాశాఖ అధికారి రాజేందర్, పరీక్షా కేంద్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు 21 పరీక్ష కేంద్రాల్లో 3546 మంది విద్యార్థులకు గాను నలుగురు విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరైనట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

Leave a Reply