ప్రగతి ప్రణాళికలో అందరూ భాగస్వాములు కావాలి

ప్రగతి ప్రణాళికలో అందరూ భాగస్వాములు కావాలి

  • భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
  • ప్రజా ప్రతినిధులకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక శిక్షణ కార్యక్రమం

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : గ్రామాలు, మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించి అభివృద్ధి సాధించేందుకు చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో ప్రజాప్రతినిధులు అందరూ భాగస్వామ్యం కావాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై శిక్షణ కార్యక్రమాన్ని గురువారం భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లాలోని సర్పంచులు, వార్డు సభ్యులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ మార్చి 6 నుంచి జూన్ 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా 99 రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో ఉన్న మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పారు.

సమస్యలను పరిష్కరించి గ్రామాల్లో అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు ఉండాలని, మిగతా సమయంలో సర్పంచులు, వార్డు కౌన్సిలర్లు పార్టీలకతీతంగా గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. ప్రభుత్వ నియమనిబంధనలు పాటిస్తూ అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని గ్రామాలు, వార్డులు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని అన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ 99 రోజుల యాక్షన్ ప్లాన్‌పై జిల్లాలోని ప్రతి ప్రజాప్రతినిధికి శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, వాటి అమలు విధానం గురించి ప్రజలకు తెలియజేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. జిల్లా అధికారులు చేస్తున్న పనులు ప్రజలకు తెలిసేలా సర్పంచులు, కౌన్సిలర్లు ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రజా పాలన ప్రణాళిక గురించి కలెక్టర్ వివరించారు . అనంతరం 99 రోజుల్లో చేపట్టే ప్రణాళికల బుక్‌లెట్లను ప్రజాప్రతినిధులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు విజయలక్ష్మి, అశోక్ కుమార్, డీఎఫ్‌ఓ నవీన్ రెడ్డి, అదనపు ఎస్పీ నరేష్ కుమార్, ఆర్డీవో హరికృష్ణ , మున్సిపల్ చైర్మన్ ఉదయ్ కుమార్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు, భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీను, ఆర్టీఏ చైర్మన్ సుంకరి రామచంద్రయ్య, జిల్లా పంచాయతీ అధికారి శ్రీలత, ఎక్సైజ్ ఎస్పీ శ్రీనివాస్, డిటివో సంధాని, హార్టికల్చర్ అధికారి సునీల్, పీడీ బాలకృష్ణ, డి ఎం ఎచ్ వో మధు సుధన్, విద్యుత్, బీసీ, మైనారిటీ, ఎస్సీ వెల్ఫేర్ అధికారులు, అన్ని శాఖల జిల్లా అధికారులు, అన్ని గ్రామాల సర్పంచులు, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Leave a Reply