విషపు పురుగు కాటుతో తాపీ మేస్త్రి మృతి

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : విషపు పురుగు కాటుకు గురై చికిత్స పొందుతూ ఓ తాపీ మేస్త్రి మృతి చెందిన ఘటన తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలో చోటుచేసుకుంది.

స్థానికుల కథనం ప్రకారం, అమ్మాపురం గ్రామానికి చెందిన గూడెల్లి నారాయణ (52) తాపీ మేస్త్రిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సుమారు 20 రోజుల క్రితం ఒక నిర్మాణ పనిలో భాగంగా బేస్మెంట్ కోసం రాళ్లు తీస్తుండగా అతనికి విషపు పురుగు కాటేసింది. అనంతరం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు.

చికిత్స సమయంలో అతని శరీరంపై దద్దుర్లు రావడంతో పరిస్థితి విషమించింది. దీంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నారాయణ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ప్రాణాలను కాపాడేందుకు సుమారు ఆరు లక్షల రూపాయల వరకు ఖర్చు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఇంటి పెద్ద మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Leave a Reply