Collector | మహిళల ఆర్థిక స్వావలంబనతోనే దేశాభివృద్ధి…

Collector | మహిళల ఆర్థిక స్వావలంబనతోనే దేశాభివృద్ధి…

  • ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను స‌ద్వినియోగం చేసుకోండి
  • విజ‌య‌వంతంగా ముందుకెళ్తున్న వారిని స్ఫూర్తిగా తీసుకోండి
  • జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ‌

Collector | ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : మహిళ‌లు ఆర్థిక స్వావలంబన సాధించినప్పుడే కుటుంబం, సమాజం, దేశం అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తుందని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ అన్నారు. మండల పరిధిలోని గుంటుప‌ల్లి రైజ్ కేంద్రాన్ని బుధవారం ఆయన సంద‌ర్శించారు. ఈ కేంద్రంలో మ‌హిళ‌ల‌కు నిర్వ‌హిస్తున్న చేతితో క‌ళాత్మ‌క వ‌స్తువుల త‌యారీతో పాటు ఇంగ్లిష్ క‌మ్యూనికేష‌న్ స్కిల్స్ శిక్ష‌ణ కార్య‌క్ర‌మాల‌ను ప‌రిశీలించారు.

అనంత‌రం కిలేశ‌పురంలో పి.ఉమ నిర్వ‌హిస్తున్న ఎద్దు గానుగ యూనిట్ ను సంద‌ర్శించారు. పీఎం ఫార్మ‌లైజేష‌న్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ స్కీమ్ (పీఎంఎఫ్ఎంఈ) ప‌థ‌కం చేయూత‌తో ఇప్ప‌టికే ఒక యూనిట్‌ను ప్రారంభించ‌గా మ‌రో యూనిట్ ప్రారంభానికి సిద్ద‌మ‌వుతున్న‌ట్లు ఉమ‌.. క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌కు వివ‌రించారు. ఆరోగ్య‌క‌ర జీవ‌న‌శైలిపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెరిగిన నేప‌థ్యంలో ఈ యూనిట్ విజ‌య‌వంతంగా న‌డుస్తోంద‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న రుణ సౌకర్యాలు, రాయితీలు, శిక్షణ కార్యక్రమాలను మహిళలు సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి దిశగా ముందడుగు వేయాలని సూచించారు.

Collector |

ఇప్పటికే విజయవంతంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న మహిళలను ఆదర్శంగా తీసుకొని మరింత మంది వ్యాపార‌వేత్త‌లుగా ఎదిగేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక బృందాల ద్వారా అనేక మంది మహిళలు విజయవంతంగా వ్యాపార రంగంలో అడుగుపెట్టి ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు. క‌లెక్ట‌ర్ వెంట డీఆర్డీఏ పీడీ ఎ.ఎన్‌.వి.నాంచార‌రావు, డీపీవో పి.లావ‌ణ్య కుమారి, ఎంపీడీవో డి.శకుంత‌ల‌, ఇబ్ర‌హీంప‌ట్నం బ్లాక్ కో – ఆర్డినేట‌ర్ శ్రీనివాస‌రావు త‌దితరులు ఉన్నారు.

Leave a Reply